మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రాష్ట్ర విభజన తర్వాత.. ఏ రాజకీయ పార్టీలోనూ లేరు కానీ.. రాజకీయానికి మాత్రం దూరంగా లేరు. అసలు విభజన చట్టమే చెల్లదని ఆయన న్యాయపోరాటం చేస్తున్నారు. న్యాయవాదిగా ఆయన తన అనుభవాన్ని, వాదనా పటిమను ప్రదర్శించేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు.. ప్రభుత్వ నిర్ణయాలపై… ముఖ్యంగా.. వైసీపీ తీవ్రంగా వ్యతిరేకించే పోలవరం, పట్టిసీమ సహా.. ఇతర అంశాలపై.. ఆ పార్టీ వాదనకు దగ్గరగా లాజిక్కులు వినిపించేవారు. ఈ లాజిక్కుల్లో ఆయన వినిపించే మొదటి మాట.. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు భంగం కలుగుతోందని.. మేధావుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నా.. ఆయన జాడ మాత్రం లేదు.
నోరెందుకు మెదపడం లేదని ప్రవాంధ్రుల లేఖ ..!
సీఎంగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసి.. పూర్తి స్థాయి మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేయక ముందే…హైదరాబాద్‌లో ఉన్న ఏపీ భవనాలన్నింటినీ… తెలంగాణ ప్రభుత్వానికి దఖలు పరిచారు. ఆ నిర్ణయం తీసుకోవడానికి కనీస చర్చ జరపలేదు. అది అయిపోగానే.. తెలంగాణ భూభాగంలో… ఏపీ ఖర్చుతో ప్రాజెక్టులు నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. పైగా.. ఏపీకి కేసీఆర్ నీళ్లిస్తున్నారని పొగిడేస్తున్నారు. గోదావరి నికర జలాలపై ఏపీకి హక్కు లేదన్నట్లుగా.,. అవన్నీ తెలంగాణ నీళ్లన్నట్లుగా.. అవి ఏపీకి ఇస్తున్నట్లుగా చెప్పుకొస్తున్నారు. ఇవే కాదు.. విభజన చట్టం ప్రకారం రావాల్సిన వాటి కోసం.. ఏపీ సర్కార్ కనీస ప్రయత్నం చేయడం లేదు. ఈ పరిస్థితులపై..ఏపీ ప్రయోజనాల పేరుతో గతంలో గొంతెత్తిన వారు.. ఇప్పుడు సైలెంట్‌గా ఉంటున్నారు. ముఖ్యంగా ఉండవల్లి.. ఏమీ మాట్లాడటం లేదు. వీటన్నింటిని గుర్తు చేస్తూ.. ప్రవాసాంధ్రులు ఉండవల్లికి ఓ లేఖ రాశారు.
వంద రోజుల నియమం పెట్టుకున్న ఉండవల్లి..!
నిజానికి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఉండవల్లి అరుణ్ కుమార్ ఓ సారి ప్రెస్ మీట్ పెట్టారు. కొత్త ప్రభుత్వం పనితీరును అంచనా వేయడానికి కనీసం.. వంద రోజుల పాటు ఏమీ మాట్లాడబోనని ప్రకటించారు. ఇంకా వంద రోజులు కాలేదు. యాభై రోజులే అయింది. అందుకే ఉండవల్లి అరుణ్ కుమార్ సైలెంట్ గా ఉన్నారని.. ఆయన వర్గీయులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన ఏపీ ప్రభుత్వ నిర్ణయాలు.. దాని వల్ల ఏపీకి జరిగిన లాభనష్టాలను అధ్యయనం చేస్తున్నారని అంటున్నారు. కచ్చితంగా… స్పందిస్తారని.. 101వ రోజునే.. ఆయన ప్రెస్ మీట్ పెడతారని.. ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
చంద్రబాబును విమర్శించినట్లుగా జగన్‌ను విమర్శించగలరా..?
ఉండవల్లి అరుణ్ కుమార్ కి వైఎస్ రాజశేఖర్ రెడ్డి దైవసమానం. ఆయన కుమారుడైన జగన్మోహన్ రెడ్డిపై.. ఆయన … ఘాటుగా విమర్శలు చేయలేరు. గతంలోనూ.. కొద్దిగా సున్నితంగానే విమర్శలు చేసినా… ఆయన బాగు కోసమే.. అన్నట్లుగా ఆయన చెప్పేవారు. అయితే.. ఇప్పుడు.. జగన్ అధికార పార్టీలో ఉన్నారు. స్వయంగా సీఎంగా ఉన్నారు. ఆయన ఏపీ ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నారనే అభిప్రాయం అంతటా ఏర్పడుతోంది. ఈ క్రమంలో.. ఉండవల్లి ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఆయన మాటలు.. ఖచ్చితంగా తటస్తుల్లో ప్రభావం చూపిస్తాయన్న అంచనా ఉండటమే దీనికి కారణం.