తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్ష పదవి మీద కొన్నాళ్లుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానంలో కొత్త అధ్యక్షుడిని నియమించాలని ఏఐసీసీ భావించింది. అయితే, అప్పట్నుంచీ రాహుల్ రాజీనామా సంక్షోభం తెరమీదికి రావడంతో కొంత ఆలస్యమైంది. ఇదే సమయంలో రాష్ట్రం నుంచి అధ్యక్ష పదవి కోసం పోటీ పడేవారి సంఖ్య కూడా ఎక్కువైంది. అయితే, ఇన్నాళ్లూ నలుగుతూ వస్తున్న ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని హైకమాండ్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. వచ్చేనెల పదో తేదీలోగా తెలంగాణకు కూడా కొత్త పీసీసీ అధ్యక్షుడిని ఎంపిక చేయాలని కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.
త్వరలో మహారాష్ట్ర, ఢిల్లీ, గోవాల్లో అసెంబ్లీ ఎన్నికలున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలో పార్టీ ఛీఫ్ ని నియమించారు. ఇక, మిగిలిన గోవా, ఢిల్లీలతోపాటు తెలంగాణకు కూడా పీసీసీ అధ్యక్షుడిని ఎంపిక చేసే కసరత్తు జరుగుతోంది. ఏఐసీసీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో ఎంపిక ప్రక్రియ ఢిల్లీలో జరుగుతున్నట్టు సమాచారం. గడచిన వారం రోజులుగా తెలంగాణకు చెందిన ప్రముఖ నేతల్ని ఒక్కొక్కరిగా ఆయన పిలిచి, కలుస్తున్నట్టు తెలుస్తోంది. పీసీసీ బాధ్యతలు ఎవరికి ఇస్తే బెటర్ అనే కోణంలో అభిప్రాయాలను తీసుకుంటున్నారని సమాచారం. అయితే, ఈ క్రమంలో మొదట్నుంచీ వినిపిస్తున్న పేరు… మల్కాజ్ గిరీ ఎంపీ రేవంత్ రెడ్డి. హైకమాండ్ కూడా ఆయనకే బాధ్యతలు ఇవ్వాలని సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది.
దీంతో, ఆ పదవి మీద ఆశపెట్టుకున్న కొంతమంది సీనియర్లు ఇప్పుడు ఢిల్లీలో చివరి విడత ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వినిపిస్తోంది. రేవంత్ బాధ్యతలు అప్పగిస్తే అసంతృప్తికి గురయ్యే నేతల జాబితా తయారు చేసుకుని, వారితో వేణుగోపాల్ భేటీ అవుతున్నట్టుగా చెబుతున్నారు. ఏదేమైనా, ఆగస్టు రెండో వారం నాటికి తెలంగాణకు కొత్త పీసీసీ అధ్యక్షుడి నియామకం జరిగిపోవడం పక్కా అనే ధోరణిలోనే అధిష్టానం ఉంది. రాష్ట్రంలో భాజపా కార్యకలాపాలు పెంచింది కాబట్టి, ఇంకా ఉపేక్షిస్తూ పోతే పార్టీకి మంచిది కాదనే అభిప్రాయానికి హైకమాండ్ కూడా వచ్చింది. ఒకవేళ, రేవంత్ ని అధికారికంగా ప్రకటిస్తే… ఆ పదవి మీద ఆశలు పెట్టుకున్న సీనియర్లు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంటుంది. పైగా, కాంగ్రెస్ లో వీర విధేయులంటూ ఈ మధ్య ఓ కొత్త విభాగం కూడా తెరమీదికి వచ్చింది కదా. మొదట్నుంచీ పార్టీలో ఉన్నవారికే కీలక పదవులు ఇవ్వాలనే డిమాండ్ ను వాళ్లూ వినిపిస్తున్నారు!