అమరావతిలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డికి క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు వ్యవహారం వివాదాస్పదమయింది. దీంతో.. పొలిటికల్‌గా డ్యామేజ్ అవుతుందని అనుకున్నారేమో కానీ.. వెంటనే.. మాట మార్చేశారు. అమరావతిలో క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని మంగళవారం.. సోషల్ మీడియాలోని తన ఖాతాల్లో పోస్ట్ చేసుకున్న ఆయన … వివాదం అయ్యే సరికి నిర్మొహమాటంగా మాట మార్చేశారు. మంగళవారం తిరుమలలో కూడా ..మీడియాతో మాట్లాడుతూ కార్యాలయం ఏర్పాటును సమర్ధించుకున్నారు. తెల్లవారే సరికి.. వేరే వెర్షన్ వినిపిస్తున్నారు.
తాను సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చెయ్యమని అధికారులను ఆదేశించానని కానీ.. క్యాంప్ ఆఫీస్ పేరుతో ప్రచారం చేస్తున్నారని రివర్స్ అయ్యారు. క్యాంప్ ఆఫీస్ వ్యవహారం అధికారిక ఉత్తర్వులు… బయటకు పొక్కడం పై ఈవో, జెఈవో లను విచారణ చెయ్యమని ఆదేశించానని కూడా.. సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు.
తనపై వస్తున్న విమర్శలను తోసిపుచ్చారు. అవసరం అయితే.. సొంత ఖర్చులు భరిస్తానని.. శ్రీవారి సొమ్మును వృధా చేయబోనని చెప్పుకొచ్చారు. ఎప్పుడు అవసరం.. ఎవరికి… అవసరం అన్నదానిపై..మరో ప్రశ్న వేయడానికి మీడియా ప్రతినిధులకు అవకాశం ఇవ్వలేదు. అయితే.. టీటీడీ చైర్మన్ అమరావతి క్యాంపాఫీస్‌లో టీటీడీ ఉన్నత ఉద్యోగులు, ఇతర సిబ్బందిలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శన విధానంలో వున్న ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాలను రద్దు చేశారు. ఈ దర్శనాలన్నీ దళారుల కోసమేనని.. టీటీడీ వ్యవహారాలు చూసే అందరికీ తెలుసు. ఈ దర్శనాలను రద్దు చేస్తే.. సామాన్యులకు ప్రయోజనం కలుగుతుంది. కానీ.. కొత్తగా మరో వీఐపీ దర్శన వ్యవస్థను ప్రవేశ పెట్టబోతున్నారని.. అందులో.. ఈ అమరావతి క్యాంపాఫీస్ కీలక పాత్ర పోషిస్తుందన్న ప్రచారం జరుగుతోంది. అమరావతిలో క్యాంప్ ఆఫీస్ అంటే.. అది అమరావతి నుంచి ఆన్ లైన్లో కూడా సిఫార్సుల చిట్టా రాబోతోందా అనే చర్చ.. టీటీడీ ఉద్యోగుల్లో ప్రారంభమయింది.
ఇప్పుడు తిరుమలలో ఉన్న దళారీల వ్యవస్థ లాంటిదే… అమరావతిలో కూడా మరొకటి తయారవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే.. అసలు తిరుమలలో సిఫార్సు లేఖలతో వీఐపీ దర్శన వ్యవస్థను ప్రవేశపెట్టింది.. వైఎస్ హయాలో జేఈవోగా ఉన్న ధర్మారెడ్డినే. ఆయన అప్పట్లో.. అర్చనానంతర దర్శన, సెల్లార్ దర్శనాల పేరుతో.. సిఫార్సు లేఖలతో దర్శన వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత జేఈవో శ్రీనివాసరాజు ఎల్ -1 దర్శనాలను తెచ్చారు. ఇప్పుడు.. ధర్మారెడ్డి రాగానే ఎల్-1 దర్శనాలను రద్దు చేసి.. మళ్లీ.. అర్చనానంతర దర్శనం, సెల్లార్ దర్శనాల్లాంటివేవో ప్రవేశ పెట్టబోతున్నారని ఇప్పటికే చెబుతున్నారు. అందుకే.. క్యాంపాఫీస్ వ్యవహారం మరింత ముదురుతోంది.