ఎందుకోగానీ… ఇప్పుడున్న పెద్ద దర్శకుల నుంచి పెద్దగా శిష్యగణం రావడం లేదు. వినాయక్, రాజమౌళి, పూరి శిష్యులుగా చెప్పుకుని వెలుగొందిన వాళ్లు ఒక్కరూ లేరు. ఎవరి దగ్గరా పనిచేయకుండా, సినిమాలు తీసే దర్శకుల సంఖ్య ఎక్కువైపోవడమే అందుకు కారణం కావొచ్చు. ఇప్పుడు బోయపాటి నుంచి ఓ శిష్యుడు వచ్చాడు. తనే అర్జున్ జంథ్యాల. `గుణ 369` సినిమాతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టాడు. ఆర్.ఎక్స్ 100 హీరో కార్తికేయ నటించిన సినిమా ఇది. బోయపాటిది యాక్షన్ శైలి. ప్రేమ కథ ఎంచుకున్నా, ఫ్యామిలీ ఎమోషన్ పట్టుకున్నాఆ కథని యాక్షన్ వైపుకు లాక్కెళ్లిపోతాడు. ఇప్పుడు శిష్యుడు అర్జున్ జంథ్యాల కూడా అదే చేశాడు. `గుణ 369` ట్రైలర్ చూస్తుంటే యాక్షన్ డోసు ఎక్కువగా కనిపిస్తోంది. కెమిస్ట్రీ సూత్రాలకు విరుద్ధంగా విలన్లు గాల్లో లేవడాలు, భూమ్మీద పడి గింగిరాలు తిరగడాలు, కొడితే గోడలు బద్దలైపోవడాలూ.. ఇవన్నీ గుణ 369 ట్రైలర్లోనూ కనిపిస్తున్నాయి. యువ హీరోలు ప్రేమ కథలు, కొత్త తరహా కాన్సెప్టులు ఎంచుకుంటే.. కార్తికేయ మాత్రం పక్కా యాక్షన్ కథవైపు పరుగులు పెడుతున్నాడు. తొలి సినిమాకే అర్జున్ జంథ్యాల ఈ రేంజులో యాక్షన్ చూపించాడంటే మున్ముందు ఇంకెంత చేస్తాడో..? ఆగస్టు 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. `ఆర్.ఎక్స్ 100`తో వచ్చిన క్రేజ్‌ని హిప్పీతో పాడు చేసుకున్న కార్తికేయ.. ముచ్చటగా మూడో సినిమాకి ఏం చేస్తాడో చూడాలి.
https://www.youtube.com/watch?v=1BL0jbgg4fU