కొత్త మున్సిపల్ చట్టానికి ఆమోదం తెలిపేందుకు తెలంగాణ అసెంబ్లీ రెండు రోజుల పాటు ప్రత్యేకంగా సమావేశం కాబోతోంది. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నందున మున్సిపల్ యాక్ట్ లో మార్పులకు శ్రీకారం చుట్టింది. పాత చట్టంలో పలు మార్పులు చేసి కొత్తచట్టాన్ని సభ ముందుకు తీసుకురాబోతుంది. ఇప్పటికే బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేవలం మున్సిపల్ బిల్లును ఆమోదించేందుకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న అసెంబ్లీ సమావేశాలు రెండు రోజులు మాత్రమే జరగనున్నాయి. గురువారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే మున్సిపల్ బిల్లును సీఎం కేసీఆర్ సభలో ప్రవేశ పెడతారు. అప్పుడే బిల్లు ప్రతులను సభ్యులకు పంపిణీ చేస్తారు. ఆ తర్వాత సభ వాయిదా వేసి.. శుక్రవారం చర్చ చేపడతారు. బిల్లుకు సభ ఆమోదం తర్వాత శాసన మండలిలో ప్రవేశపెట్టి ఆదే రోజు ఆమోదించే అవకాశం ఉంది.
తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రధాన ప్రతి పక్షం లేకుండా సభ జరగబోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి 19 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అందులో 12 మంది ఎమ్మెల్యేలు .. టీఆర్ ఎస్ లో విలీనం చేసుకోవటంతో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయింది. ప్రస్తుతం సభలో టీఆర్ ఎస్ బలం నామినెటెడ్ ఎమ్మెల్యేతో కలిపి 104కు చేరింది. ఎంఐఎం కు 7 గురు, కాంగ్రెస్ కు 6 గురు, టీడీపీ, బీజేపి నుంచి ఇద్దరు సభ్యులున్నారు. ప్రస్తుతం సభలో టీఆర్ ఎస్ తర్వాత ఎంఐఎం కు ఎక్కువ మంది సభ్యులున్నారు.
ప్రతి పక్ష పార్టీల్లో ఎక్కువ మంది సభ్యులున్న ఎంఐఎం కు ప్రధాన ప్రతి పక్ష హోదా కల్పించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రతి పక్ష హోదా దక్కాలంటే.. పదో వంతు మంది సభ్యులుండాలి. అయితే ఎంఐఎం కు ప్రతి పక్ష హోదా ఇవ్వాల్సినంత బలం లేకపోయినా.. స్పీకర్ తన విచక్షణాధికారంతో ఇవ్వొచ్చు. ఈ హోదా ఇవ్వాలని ఓవైసీ బ్రదర్స్ బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. వారి కోరికను.. కేసీఆర్ తీరుస్తారని అంటున్నారు.