సాక్షి దినపత్రిక ఎడిటోరియల్ డైరక్టర్ కొండుభట్ల రామచంద్రమూర్తి… తన పదవి నుంచి వైదొలిగారు. సాక్షి పత్రికను ప్రచురిస్తున్న జగతి పబ్లికేషన్స్ ఎడిటోరియల్ డైరక్టర్‌గా ఆయన 2014 సెప్టెంబర్‌లో చేరారు. తెలుగు జర్నిలిజంలోని సీనియర్ జర్నలిస్టుల్లో ఒకరు అయిన కె.రామచంద్రమూర్తి .. సాక్షి పత్రికను.. ఎన్నికల సమయంలో.. ప్రభావవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషించారు. ప్రభుత్వంపై పోరాటంలో సాక్షి పత్రిక పాత్ర తక్కువ చేయలేనిది. ఆయన స్వయంగా త్రికాలమ్ పేరుతో వారాంతపు ఆర్టికల్స్‌తో.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేవారు. 2014 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తరవాత సాక్షి పత్రికకు… న్యూట్రల్ ఇమేజ్ తీసుకురావాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు జగన్మోహన్ రెడ్డి… కొండుభట్ల రామచంద్రమూర్తి వైపు మొగ్గారు. అప్పటికే.. హెచ్ఎంటీవీ, హన్స్ ఇండియా ఇంగ్లిష్ పేపర్ బాధ్యతలు చూస్తున్న ఆయన.. జగన్ పిలుపుతో సాక్షి మీడియా గ్రూప్‌లో చేరారు. రావడంతోనే ఆయనకు.. ఎడిటోరియల్ డైరక్టర్ గా కీలక బాధ్యతలు కట్టబెట్టారు. అప్పట్నుంచి రామచంద్రమూర్తి.. తనదైన శైలిలో పత్రికను నడిపారు.
అయితే.. సాక్షి పత్రికలో ఉద్యోగుల వ్యవస్థ .. భిన్నంగా ఉంటుంది. ఓ స్థాయి ఉద్యోగులంతా.. ఎవరికి వారు.. గ్రూపులు మెయిన్ టెయిన్ చేస్తూంటారని చెబుతూంటారు. ఒకరంటే ఒకరికి పడకపోవడం… చాలా కాలంగా పత్రికలో పాతుకుపోయిన వారు తమ ప్రభావాన్ని గట్టిగా చూపడంతో… రామచంద్రమూర్తిపై.. జగన్మోహన్ రడ్డికి నెగెటివ్ ఇమేజ్ పడేలా చేశారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో.. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు.. పత్రిక వ్యవహారాలన్నింటినీ.. చూసుకోవడానికి ప్రసిద్ధి హిందీ దినపత్రిక దైనిక్ జాగరణ్ సంస్థ నుంచి.. ఓ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ను… సంస్థలో చేర్చుకున్నారు. అప్పట్నుంచి.. ఆయనే మొత్తం వ్యవహారాలను చక్క బెడుతున్నారని చెబుతున్నారు. ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిన తర్వాత మొత్తంగా పత్రిక వ్యవస్థను ఓ గాడిలో పెట్టాడానికి.. స్వతంత్ర వ్యవస్థతో .. మొత్తం మదింపు చేస్తున్నారని కూడా సాక్షి ఉద్యోగులు చెబుతున్నారు. ఈ క్రమంలో రామచంద్రమూర్తి నిష్క్రమణం ఆశ్చర్యం కలిగించేదే.
నిజానికి రామచంద్రమూర్తిని సాక్షి పత్రికకు ఎడిటోరియల్ డైరక్టర్ గా తీసుకున్నప్పుడే చాలా మంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే.. ఆయనకు.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సన్నిహితుడిగా ముద్ర ఉంది. మామూలుగా అయితే.. ఇలాంటి ముద్రవారిని జగన్మోహన్ రెడ్డి కనీసం దగ్గరకు కూడా రానీయరు. కానీ అనూహ్యంగా రామచంద్రమూర్తిని… తన పత్రికకు ఎడిటోరియల్ డైరక్టర్ గానే నియమించారు. అప్పట్నుంచి.. సాక్షిలో .. ఎలాంటి వార్తలు వచ్చినా… అది వైసీపీకి నష్టం కలిగించేలా ఉందని.. రామచంద్రమూర్తిని పెట్టుకుని.. వైసీపీకి మైలేజీ వచ్చే కథనాలు ఎలా రాస్తారని.. ఆయనకు పడని వర్గాలు విస్తృతంగా ప్రచారం చేసేవి. మొత్తానికి ఆయనను నేరుగా పొమ్మనకుండా పొగబెట్టారన్న మాట మాత్రం.. సాక్షి క్యాంపస్‌లో వినిపిస్తోంది. తర్వాతి ఎడిటోరియల్ డైరక్టర్‌గా ఎవరికి అవకాశం ఇస్తారోననే చర్చ మాత్రమే ఇప్పుడు సాక్షి ఆఫీసులో జరుగుతోంది.