పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నాడంటూ యూపీఏ పక్షాలతో విమర్శలు ఎదుర్కొన్న కేసీఆర్, పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ మీద గుర్రుగా ఉన్నారు. బీజేపీ ఇంత భారీ విజయాన్ని సాధిస్తుందని ఊహించని కేసీఆర్, ఎట్టకేలకు మోడీ ఎందుకు అంత భారీ విజయాన్ని సాధించగలిగాడు అన్న విషయం మీద కేబినెట్ మీటింగ్ లో తన విశ్లేషణను చెప్పుకొచ్చారు. కేవలం సెంటిమెంట్ తోనే మోడీ గెలిచాడు అంటూ కేసీఆర్ పరోక్షంగా మోడీపై విమర్శలు చేశారు. వివరాల్లోకి వెళితే..
మోడీ దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున సీట్లు కైవసం చేసుకోవడం, పైగా తెలంగాణలో సైతం నాలుగు ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవడం బహుశా కేసీఆర్ కు నచ్చినట్లుగా లేదు. 17 స్థానాలలో 16 ఎంపీ స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకుంటుందని బీరాలు పలికిన టీఆర్ఎస్ నేతలు తీరా ఫలితాలు చూశాక కంగుతిన్నారు. అయితే ఆ ఫలితాల మీద తన విశ్లేషణను కేసీఆర్ ఇప్పటిదాకా ఎక్కడా బయట పెట్టలేదు. కానీ తాజాగా జరిగిన కేబినెట్ మీటింగ్ లో కేసీఆర్ మాట్లాడుతూ మోడీ గత అయిదేళ్లలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని, కేవలం ఆఖరి నిమిషంలో దేశభక్తి, జాతీయత వంటి సెంటిమెంటును రెచ్చగొట్టి ప్రజలు తనకు ఓటు వేసేలా చేసుకున్నారని, ప్రజలు కూడా సెంటిమెంట్ మాయలో పడిపోయి మోడీ అభివృద్ధి చేయలేదన్న విషయాన్ని పట్టించుకోకుండా ఓటు వేశారని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
అంతా బాగానే ఉంది కానీ, సెంటిమెంట్ పేరుతో మోడీ ఓట్లు కొల్లగొట్టాడని కేసీఆర్ విమర్శించడమే చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 2014 లో జరిగిన ఎన్నికలకు ముందు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినప్పటికీ తెలంగాణ ప్రజలంతా టిఆర్ఎస్ కు పట్టం కట్టడానికి కూడా ఈ సెంటిమెంట్ ఏ కారణం. అలాగే 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒకానొక సమయంలో ప్రజా కూటమికి ఆధిక్యత ఉందని విశ్లేషకులు భావించినప్పటికీ, చంద్రబాబు ని టార్గెట్ గా చేసుకుని ప్రజా కూటమిని గెలిపిస్తే పాలన అమరావతికి వెళ్లిపోతుందని తెలంగాణ ప్రజలను కేసీఆర్ సెంటిమెంట్ తో ఆకర్షించడం వల్లే 2018 అసెంబ్లీ ఎన్నికలను కేసీఆర్ అంత భారీ మెజార్టీతో గెలిచాడు అన్న వాదన కూడా ఉంది.
మొత్తానికి తన రాజకీయ ప్రస్థానం మొత్తం తెలంగాణ సెంటిమెంటుతో నడిపించిన కేసీఆర్, మోడీ ని సెంటిమెంటుతో గెలిచాడు అని వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.