కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీరు ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కి గుడి కట్టిస్తా అని కాసేపు అంటారు, అధికార పార్టీ అద్భుతంగా పనిచేస్తోందని మెచ్చుకుంటారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి తాను ఎప్పుడూ కట్టుబడే ఉంటాననీ అంటుంటారు. అలాగని, ఆ పార్టీకి తలనొప్పులు పెంచే వ్యాఖ్యలూ చర్యలు తగ్గించుకోరు! ఇప్పుడు కూడా అలాంటి చర్యకే జగ్గారెడ్డి పాల్పడ్డారు. పార్టీ ఫిరాయింపులపై పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నిరసన చేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో సేవ్ డెమొక్రసీ అంటూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు తెరాస తీరుపై మండిపడ్డారు. సీఎల్పీ విలీనంపై అధికార పార్టీ తీరుని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తప్పుబడుతున్నారు. సహజంగానే, ఈ నిరసనలకు కాంగ్రెస్ నేతలంతా హాజరవ్వాలి కదా. కానీ, జగ్గారెడ్డి గైర్హాజరయ్యారు. ఎందుకలా చేశారూ అంటే… కొన్ని వ్యక్తిగత విలువలకు కట్టుబడి ఉన్నాను కాబట్టి అంటూ కారణం చెబుతున్నారు.
నిన్న జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొనకపోవడంతో జగ్గారెడ్డి దగ్గర వివరణ కోరారు పీసీసీ అధ్యక్షుడు. అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ముందే అనుకుంటే, మీరు రాకపోవడం వేరే సంకేతాలు ఇచ్చినట్టుగా ఉంది కదా అని పీసీసీ ఆయన్ని ప్రశ్నించింది. తనకు కొన్ని వ్యక్తిగత కారణాలున్నాయి కాబట్టే పాల్గొనలేకపోయానని పీసీసీకి చెప్పానన్నారు జగ్గారెడ్డి. తాను ఎప్పుడూ పార్టీకి కట్టుబడి ఉండే వ్యక్తిననీ, కానీ ఫిరాయింపులపై నిరసన కార్యక్రమం పార్టీ నిర్ణయం కాదన్నారు. అది సీఎల్పీ కార్యక్రమం మాత్రమే అన్నారు. గతంలో తాను రెండు పార్టీలు మారాననీ, కాబట్టి ఫిరాయింపులపై నిరసన అంటే తనకు ఏదో ఫీలింగ్ ఉందనీ, కాబట్టే పాల్గొనలేనని చెప్పానన్నారు.
జగ్గారెడ్డి పార్టీ మారతారు అనే చర్చ ఎప్పట్నుంచో ఉంది. తెరాసలోకి వెళ్లలేక, కాంగ్రెస్ లో ఇమడలేక ఆయన సందిగ్ధంలో ఉన్నారనే అభిప్రాయం ఉంది. దీనిపై ఆయన స్పందిస్తూ… తాను ఏ పార్టీలోకి వెళ్లలేనీ, అంతేకాదు తనను ఏ పార్టీ తీసుకున్న ఇబ్బందులు పడుతుందని చెప్పారు! తనతో చాలా ఇబ్బందులుంటాయనీ, తనను చేర్చుకున్న పార్టీకి మనశ్శాంతి ఉండదని ఆయన చెప్పడం విశేషం. గతంలో తానూ పార్టీ మారానన్న ఫీలింగ్ తో ఉన్నాను కాబట్టే, పార్టీ కార్యక్రమానికి వెళ్లలేదన్నారు. ఈ కామెంట్ ద్వారా కాంగ్రెస్ పార్టీలో కొత్తగా చేరిన వారిని ప్రశ్నిస్తున్నారా అనే అభిప్రాయం కలుగుతోంది. ఏదేమైనా, ప్రస్తుతానికి జగ్గారెడ్డి పార్టీ మారరు అని మరోసారి చెప్పారు.