రెబల్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరయ్యే వరకూ.. కర్ణాటకాన్ని కొనసాగించాలని.. కాంగ్రెస్ – జేడీఎస్ కూటమి సర్కార్ దాదాపుగా నిర్ణయించేసుకున్నాయి. అందుకే సభను పదే పదే వాయిదా వేస్తూ… బలపరీక్షను నిర్వహించడం లేదు. గవర్నర్ ఒత్తిడీ వారిపై పని చేయడం లేదు. కర్ణాటకలో విశ్వాస పరీక్షపై చర్చ ఇంకా పూర్తి కాలేదు. ఓ వైపు గవర్నర్ నుంచి ఒత్తిడి.. ఇటు స్పీకర్.. దీంతో కర్ణాటక అసెంబ్లీలో సీన్ హీటెక్కించింది. ఓటింగ్ ఖాయమని అంతా భావించినా… చర్చకే సమయం గడిచిపోయింది. ముఖ్యంగా అందరూ సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ కాంగ్రెస్, జేడీఎస్ నేతలు డిమాండ్ చేశారు. స్పీకర్ కూడా అందుకే మొగ్గు చూపారు. అందుకే సభను సోమవారం కూడా కొనసాగించబోతున్నారు.
మరో వైపు కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ దినేష్ గుండూ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమ అభ్యర్థులకు విప్ జారీ చేసే అంశంపై స్పష్టత ఇవ్వాలంటూ పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాదు… విప్ అనేది రాజకీయ పార్టీలకు ఉన్న హక్కు అని.. గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఆ హక్కును కాలరాసే విధంగా ఉన్నాయంటూ పిటిషన్లో పేర్కొన్నారు. సభకు ఇప్పటికే 20 మంది సభ్యులు హాజరు కాలేదు. తమ సభ్యులపై అనర్హత వేటు వేసేందుకు విప్ జారీ చేయాలి..! కానీ సుప్రీంకోర్టు ఆదేశాలు ఉండటంతో… కాంగ్రెస్ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కుమారస్వామి కూడా.. తనను గవర్నర్ ఆదేశించలేరని చెబుతున్నారు. సభా వ్యవహారాల్లో గవర్నర్ జోక్యంపై కుమారస్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విప్‌పై స్పష్టతతో పాటు శాసనసభ వ్యవహారాల్లో గవర్నర్ జోక్యంపైనా ముఖ్యమంత్రి పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీలో బలపరీక్షపై చర్చ జరుగుతోందని.. ఇంతలోనే బలం నిరూపించుకోవాలంటూ గవర్నర్ జోక్యం చేసుకుంటున్నారని.. అది అసెంబ్లీ ప్రొసీడింగ్స్‌కు కూడా విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. శాసనసభ వ్యవహారాల్లో గవర్నర్‌కు పరిమితమైన అధికారాలే ఉంటాయని.. గవర్నర్ సభా వ్యవహారాల్లో జోక్యం చేసుకొనే వీలు లేదంటూ ఆయన వివరించారు. దీంతో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది.
గవర్నర్ రెండు సార్లు కుమారస్వామికి లేఖ రాశారు. ఒకటి మధ్యాహ్నం ఒకటిన్నరలోపు, మరోకటి సాయంత్రం ఆరు గంటల లోపు.. బలం నిరూపించుకోవాలనేది ఆ లేఖల సారాంశం. హార్స్ ట్రేడింగ్ జరుగుతోందని.. తనకు సమాచారం ఉందని.. అందుకే వెంటనే బలపరీక్ష నిర్వహించాలని.. గవర్నర్ వజూభాయ్ వాలా చెబుతున్నారు. అయితే గవర్నర్ ఆదేశాలను ఏ మాత్రం పట్టించుకోలేదు సీఎం కుమారస్వామి. అసలు స్పీకర్ విధుల్లో జోక్యం చేసుకునే హక్కు గవర్నర్‌కు లేదంటూ కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. ఓటింగ్ ఎప్పుడు పెట్టాలన్న దానిపై స్పీకర్‌కు మాత్రమే అధికారం ఉందని స్పష్టం చేశారు. ఈ మొత్తం వ్యవహారాలతో గవర్నర్.. కేంద్రానికి రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తారనే ప్రచారం.. ఊపందుకుంటోంది.