మరోసారి తెరాస ఎమ్మెల్యేల మీదే ఎన్నికల బాధ్యతల్ని పెట్టారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు రానున్నాయి. కొత్త మున్సిపల్ చట్టాన్ని కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో నాయకులతో ఆయన మాట్లాడుతూ… రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక దగ్గర్నుంచీ, ఎన్నికల్లో వారిని గెలిపించుకునే వరకూ మొత్తం బాధ్యత అంతా తెరాస ఎమ్మెల్యేల మీదే ఉంటుందని చెప్పారు. శాసన సభ్యులు లేని నియోజక వర్గాల్లో పార్టీ ఇన్ ఛార్జులు ఆ బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా మరింత పటిష్టంగా చేయాలనీ, అనుకున్న లక్ష్యాన్ని సాధించాలనీ, అన్ని మున్సిపాలిటీల్లో తెరాస జెండా ఎగరాలని దిశానిర్దేశం చేశారు.
నిజానికి, ఈ మున్సిపల్ ఎన్నికలు ఎమ్మెల్యేలకు మరో పరీక్షే అని చెప్పొచ్చు. ఎందుకంటే, లోక్ సభ ఎన్నికల ముందు కూడా.. ఇలానే, ఎంపీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత ఎమ్మెల్యేలదే అన్నారు. ఎంపీ అభ్యర్థుల తరఫున వారే ప్రజల్లో ఉండాలన్నారు. శాసనసభకు ముందుస్తుగా ఎన్నికలు జరిగిపోవడంతో, గెలిచిన వారంతా కాస్త రిలాక్స్ అయిపోయారనే విమర్శలు అప్పట్లో వినిపించాయి. ఎంపీ అభ్యర్థుల తరఫున వారు ప్రచారానికి వెళ్లడం లేదనీ, గెలిచేశాం కదా.. మన పదవికి ఎలాంటి ఢోకా లేదానే ధీమాతో వ్యవరించారనే కామెంట్లున్నాయి. దాని వల్లనే సారు కారు పదహారు అనుకుని లోక్ సభ ఎన్నికలకు వెళ్లినా… కాంగ్రెస్ కి ఓ మూడు, భాజపాని ఓ నాలుగు ఎంపీ స్థానాలు వెళ్లిపోయాయనీ, గెలిచిన చోట్లలో కూడా ఆశించిన స్థాయిలో మెజారిటీ లేకుండా పోయిందనే విశ్లేషణలను పార్టీ చేసుకుంది. ఎమ్మెల్యేలు సరిగా పనిచేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదనే విమర్శలున్నాయి.
దీంతో గతంలో విమర్శలు ఎదుర్కొన్న ఎమ్మెల్యేలంతా వారివారి నియోజక వర్గాల పరిధిలోని మున్సిపల్ స్థానాల్లో పార్టీ గెలుపు కోసం ఇప్పుడు శక్తి వంచన లేకుండా పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో ఎదుర్కొన్న విమర్శల నుంచి బయటపడాలంటే… ఇదో అవకాశంగానూ ఉంది. ఇప్పుడు కచ్చితంగా బాగా పనిచేయాల్సిన అవసరం కనిపిస్తోంది కాబట్టి… అభ్యర్థుల ఎంపిక నుంచి గెలుపోటముల వరకూ అన్నీ ఎమ్మెల్యేలకు అప్పగించడం కూడా వ్యూహాత్మకంగా కనిపిస్తోంది. మొత్తానికి, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీని ఎమ్మెల్యేలు ఏ విధంగా నడిపిస్తారో చూడాలి.