బిగ్ బాస్ 3 షో పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. రేపటి నుంచి (ఆదివారం) ఈ షో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. యువతని తప్పుదోవ పట్టించే ఈ షోని నిలుపుదల చేయాలని పలు ప్రజా సంఘాలు నిరసన గళం వినిపిస్తున్నాయి. ఈ షోపై ఇప్పటికే న్యాయస్థానంలో పలు పిటీషన్లు దాఖలయ్యాయి. ఇప్పుడు విద్యార్థులు కూడా అడ్డుకోవాలని చూస్తున్నారు. ఈ షోని నిలుపుదల చేయాలని ఓయూ విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తోంది. కొద్దిసేపటి క్రితం విద్యార్థి సంఘాలు హైదరాబాద్లోని నాగార్జున ఇంటిని ముట్టడించాయి. ఆందోళన చేపట్టాయి.
పోలీసులు ఎలాంటి ఘటనలూ జరక్కుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. నాగ్ ఇంటి ముందు నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు అన్నపూర్ణ స్టూడియోస్ ముందూ భద్రతని ఏర్పాటు చేశారు. బిగ్ బాస్ షోని ఇది వరకు వ్యతిరేకించిన నాగార్జున ఇప్పుడు ఆ షో ఎలా చేస్తున్నారని? ఈ షోలో పాల్గొనే మహిళలు సైతం లైంగిక వేధింపులకు గురవుతున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, వాటికి సమాధానం ఇవ్వకుండా ఈ షోలో నాగార్జున ఎలా పాల్గొంటారని? విద్యార్థి నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ షోని నిలుపుదల చేసే వరకూ తమ ఆందోళన ఆగదని హెచ్చరిస్తున్నారు. మరోవైపు తనకూ, అన్నపూర్ణ స్టూడియోస్కీ రక్షణ కావాలని నాగార్జున కూడా ఇది వరకే పోలీసులకు విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. షో మొదలవ్వడానికి ముందే… ఈ స్థాయిలో నిరసన వ్యక్తం అవుతోందంటే – మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో మరి..?
https://youtu.be/oYWq6vNxdMM