వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగు రాష్ట్రాల మధ్య… బోలెడంత సఖ్యత ఏర్పడింది. అందులో భాగంగానే… హైదరాబాద్ లో ఉన్న ఏపీ భవనాలను.. తెలంగాణ సర్కార్కు ఇచ్చేశారు. వాటి స్థానంలో… ఇప్పుడు తెలంగాణ సర్కార్ కొత్త సచివాయాన్ని కట్టుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. అలాగే..ఏపీ ఎప్పట్నుంచో అభ్యంతరం తెలుపుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వెళ్లి ప్రారంభోత్సవం చేశారు. ఆ తర్వాత ఉమ్మడి సంస్థల విభజన చేసి తీరుతామని ప్రకటించారు. అధికారుల స్థాయిలో చర్చలు జరిగాయి. గవర్నర్తో ఓ సారి సమావేశమై.. విభజన ఫార్ములాను ప్రకటించడమే తరువాయని.. పది రోజుల కిందట చెప్పుకున్నారు. కానీ ఇప్పటి వరకూ మళ్లీ పురోగతి లేదు.
విభజన చట్టంలోనే షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన… వివాదాస్పదంగా మారింది. ఎక్కడి ఉన్నవి అక్కడేనని.. తెలంగాణ సర్కార్ వాదిస్తోంది. అంటే.. హైదరాబాద్ లో ఉన్నవి మొత్తం .. తెలంగాణవేనని చెబుతోంది. కానీ ఉమ్మడి రాష్ట్రంలో రాజధాని హైదరాబాద్ కాబట్టి.. సహజంగా…ఏ సంస్థ ప్రధాన కార్యాలయమైనా హైదరాబాద్ లోనే ఉంటుందని… అలాంటప్పుడు.. మొత్తం ఎలా తీసుకుంటారని.. జనాభా ప్రాతిపదికన.. ఆ సంస్థల ఆస్తులు కూడా పంచాల్సిందేనని ఏపీ డిమాండ్ చేస్తోంది. ఈ పంచాయతీ తెగకపోవడంతో.. వివాదం పరిష్కారం కాలేదు. ఇప్పుడు.. జగన్, కేసీఆర్ వీటిని పరిష్కరించాడనికి ముందుకొచ్చారు. తెలంగాణకు అనుకూలంగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్న జగన్.. ఉమ్మడి సంస్థల విషయంలో మాత్రం… కాస్త ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడినట్లుగా కనిపిస్తోంది.
గతంలో.. ఉమ్మడి సంస్థగా ఉన్న ఉన్నత విద్యామండలి ఇష్యూలో… ఏపీ సర్కార్ కోర్టుకు వెళ్లింది. జనాభా ప్రాతిపదికన పంచుకోవాలని కోర్టు స్పష్టమైన తీర్పునే చెప్పింది. అది ఉమ్మడి సంస్థలన్నింటినీ వర్తిస్తుందని.. ఏపీ వాదిస్తోంది. కానీ.. అన్నీ తమవేనని… తెలంగాణ చెబుతోంది. ఇప్పటికీ.. తెలంగాణ ఆ వాదనకే కట్టుబడి ఉంది. కానీ అన్నీ ఇచ్చేస్తే.. ఏపీలో వ్యతిరేకత వస్తుందని.. జగన్మోహన్ రెడ్డి ముందూ వెనుకాడుతున్నారని చెబుతున్నారు. పంచుకుందామని.. ఎంతగా చెప్పినా.. తెలంగాణ అధికారులు.. మొత్తం తమకు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆస్తులు లేని కొన్ని సంస్థలను మాత్రం పంచడానికి.. తెలంగాణ సిద్ధమంటున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి సంస్థల విభజన ప్రక్రియ వెనుక్కు జరుగుతోందంటున్నారు.