తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ఇప్పట్నుంచే భాజపా వ్యూహాత్మకంగా అడుగులేస్తున్న సంగతి తెలిసిందే. అధికార పార్టీపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ, పార్టీలోకి నాయకుల్ని చేర్చుకుంటూ, మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చూపిస్తామని ప్రకటనలు చేస్తూ ఫుల్ జోష్ లో ఉన్నారు భాజపా నాయకులు. అయితే, తెలంగాణలో ఏదో ఒకటి చేసి అధికారంలోకి వెంటనే వచ్చేయాలన్న ఆరాటం లేదనీ, విజన్ 2023తో ముందుకెళ్తున్నామన్నారు కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి. ముందస్తు ఎన్నికల కోసం తాము చూడటం లేదనీ, షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయనీ, ఆ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ప్రజల్లో సీఎం కేసీఆర్ పాలనపై వ్యతిరేకత ఉందనీ, పార్లమెంటు ఎన్నికల్లో అదే వ్యక్తమైందన్నారు. పదహారు సీట్లూ తమకే వస్తాయని ధీమాతో కేసీఆర్ ఉంటే, ఏడు సీట్లలో తెరాస ఓడిపోయిందన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే తరహా వ్యతిరేకత వ్యక్తమౌతుందని జోస్యం చెప్పారు. తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారనీ, ఆ మార్పు భాజపాతో సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు కిషన్ రెడ్డి. మాస్టర్ ప్లాన్స్ పెట్టుకుని తెరాస ఓడించాల్సినంత అవసరం ఉందనీ, ప్రజలే తెరాస విషయంలో పక్కా మాస్టర్ ప్లాన్ తో ఉన్నారన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలూ భాజపాని కోరుకుంటున్నాయనీ, తెలంగాణలో కూడా అదే జరుగుతుందన్నారు. మేం మతం గురించి ఏ రాష్ట్రంలోనూ మాట్లాడటం లేదనీ, మజ్లిస్ పార్టీని పక్కనపెట్టుకుని మతాల గురించి కేసీఆర్ మాట్లాడటమేంటని ప్రశ్నించారు కిషన్ రెడ్డి.
తెలంగాణలో టార్గెట్ 2023తో వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నది భాజపా. కానీ, తమ వ్యూహాన్ని ప్రజల వ్యూహంగా చెప్పడమే భాజపా కొత్త వ్యూహం అనొచ్చు. నిజానికి, ఇప్పట్నుంచే 2023లో జరగబోయే ఎన్నికల గురించి ప్రజలు ఆలోచించరు. మరో ఐదేళ్ల తరువాత ఫలానా పార్టీని అధికారం నుంచి దించేద్దామని సామాన్యులు అదే పనిగా చూడరు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని ఐదేళ్లపాటు గమనిస్తారు, చివరి ఏడాదిలో అన్నీ ఆలోచించుకుని… అప్పుడు మార్పు నిర్ణయం తీసుకుంటారు. అంతేగానీ, కిషన్ రెడ్డి చెప్పినట్టు… తెలంగాణ ప్రజలు ఇప్పట్నుంచే మార్పు కోరుకుంటున్నారని చెప్పడం ప్రస్తుతానికి ఊహాజనితం. పార్టీని బలోపేతం చేసుకోవడం, కేడర్ కి పెంచుకుంటూ ముందుకు సాగడం అనేది భాజపా వ్యూహం. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలనేది ఒక పార్టీ లక్ష్యం. దాన్ని ఇప్పట్నుంచే ప్రజల వైపు నుంచి అభిప్రాయాన్ని మార్చే ప్రయత్నాలను భాజపా నేతలు మొదలుపెట్టేశారు! కాబట్టి, ఇది భాజపా మాస్టర్ ప్లాన్ మాత్రమే.