ఆంధ్రప్రదేశ్‌లో చర్చి పాస్టర్లకు జీతాలివ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం .. వివాదాస్పదంగా మారుతోంది. మెల్లగా ఈ అంశాన్ని రాజకీయ పార్టీల నేతలు.. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. సోషల్ మీడియాలో దీనిపై… విస్తృతంగా వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. చర్చి పాస్టర్లకు నెలకు రూ. ఐదు వేలు ఇస్తామని జగన్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. దాని ప్రకారం.. బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. ఇప్పుడు ఇది వివాదాస్పదం అవుతోంది. అసలు చర్చి పాస్టర్లను ఎలా ఎంపిక చేస్తారనే ప్రశ్నలు వస్తున్నాయి. దీనిపై ఇంత వరకూ.. క్లారిటీ ఇవ్వలేదు కానీ… రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చిన్నా, పెద్ద చర్చి పాస్టర్లు మాత్రం… రూ. ఐదు వేల కోసం ఇప్పటి నుంచే దరఖాస్తులు చేసుకోవడానికి ప్రిపేరవుతున్నారు.
ప్రజల సొమ్మును పాస్టర్లకు జీతాలుగా ఎలా ఇస్తారంటున్న పార్టీలు..!
నిజానికి దేవాదాయశాఖ కిందకు గుళ్లూ వస్తాయి. ఆ గుళ్ల నుంచి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కాబట్టి… దేవాదాశాఖ ఉద్యోగులు, అర్చకులు.. ఇతరులకు జీతాలు చెల్లిస్తారు. అలాగే.. ముస్లింలకు సంబంధించి వక్ఫ్ బోర్డ్ ఉంటుంది. వక్ఫ్ బోర్డుకి కూడా.. భారీగా ఆస్తులు, ఆదాయం ఉన్నాయి. వక్ఫ్ బోర్డును ప్రభుత్వమే నియమిస్తుంది. ఆ బోర్డుకు ప్రభుత్వం ఇచ్చే నిధులు… వచ్చే ఆదాయంతో కలిసి.. ముస్లిం సంక్షేమానికి ఉపయోగిస్తారు. కానీ.. క్రిస్టియన్స్‌కు సంబంధించినంత వరకూ.. ఎలాంటి వ్యవస్థా.. ఆంధ్రప్రదేశ్‌లో లేదు. క్రిస్టియన్ సంస్థలు చాలా ఉన్నప్పటికీ.. వాటన్నింటితో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. ఈ క్రమంలో ఎవరి సొమ్మును.. పాస్టర్లుగా జీతాలు చెల్లిస్తారన్నది.. చర్చనీయాంశం అవుతోంది.
అసలు పాస్టర్లు అంటే ఎవరో చెప్పాలని డిమాండ్లు..!
ఏపీలో అసలు క్రిస్టియన్స్ కన్నా.. మత మార్పిడి ద్వారా క్రైస్తవులైన వారే్ ఎక్కువ. అలాంటి వాకే ఎక్కువగా పాస్టర్లుగా కూడా మారారు. అక్కడే అసలు సమస్య వస్తోంది. ఎవరి సొమ్మును.. ముఖ్యమంత్రి.. పాస్టర్లకు నెల జీతాలుగా ఇవ్వాలనుకుంటున్నారన్న చర్చను రాజకీయ పార్టీలు ప్రారంభిస్తున్నాయి. ప్రజల్లోకి ఈ అంశాన్నే తీసుకెళ్తున్నాయి. ఈ లోపే పలువురు… పాస్టర్ల ఖాతాలో నెలకు రూ. ఐదు వేలు జీతం వచ్చేలా చేస్తామంటూ… పాస్టర్ల దగ్గర డబ్బులు వసూలు చేయడం ప్రారంభించారు. ఇది చేస్తుంది వైసీపీ నేతలే కావడం.. ఈ వ్యవహారం ప్రభుత్వ పెద్దల వద్దకూ చేరడంతో… క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ ఎండీ ఏసురత్నం ద్వారా ప్రభుత్వం స్పష్టత ఇప్పించింది.
ప్రభుత్వం స్పందించకపోతే రాజకీయ సమస్యగా మారిపోతుందా..?
నిజానికి అర్చకులకు అయినా… మౌజమ్‌లకు అయినా… వారు ఆ స్థాయికి చేరుకోవాలంటే.. ఓ ప్రమాణం ఉంటుంది. కానీ.. పాస్టర్లకు మాత్రం.. అలాంటిదేమీ లేదు. ఎవరైనా… ఏదో ఓ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ పేరు పెట్టుకుని ప్రార్థనలు జరిపేసి.. పాస్టర్ గా మారిపోవచ్చు. వారి మత గ్రంధం చదవడం వస్తే చాలు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవర్ని పాస్టర్లుగా ఎంపిక చేసి జీతాలిస్తారనేది.. చర్చనీయాంశంగా మారింది. ప్రబుత్వం.. దీనిపై వీలైనంత త్వరగా క్లారిటీ ఇవ్వకపోతే రాజకీయ సమస్యగా మారినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.