ఒకానొక సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వాన్ని కుదిపేసిన ఆదర్శ్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణంలో నిందితుడుగా ఉన్న మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ న్ని విచారించేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ సి.హెచ్. విద్యాసాగర్ రావు సిబిఐకి ఈరోజు అనుమతి మంజూరు చేసారు. ఆయనను విచారించేందుకు అనుమతించవలసిందిగా కోరుతూ సిబిఐ గత ఏడాది అక్టోబరు 8వ తేదీన ఒక లేఖ వ్రాసింది.
ఈ కుంభకోణంపై విచారణకు నియమించబడిన జస్టిస్ పాటిల్ కమీషన్ నివేదికలో అశోక్ చవాన్ పై అనుమానాలు వ్యక్తం చేసింది. అలాగే 2014లో బోంబే హైకోర్టులో దాఖలయిన క్రిమినల్ రివిజన్ పిటిషన్ న్ని విచారించినపుడు కోర్టు వ్యక్తం చేసిన కొన్ని అభిప్రాయాలకు అందుకు అనుగుణంగానే ఉన్నాయి. రాజ్యాంగ, న్యాయ నిపుణులను సంప్రదించిన తరువాత గవర్నర్ విద్యాసాగర్ రావు అశోక్ చవాన్ న్ని విచారించేందుకు సిబిఐకి అనుమతించారు.
ఈ కుంభకోణంలో మాజీ కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండేతో సహా అనేకమంది కాంగ్రెస్ ప్రముఖుల పేర్లు కూడా ఉన్నాయి. ముఖ్యమంత్రిగా పనిచేసిన అశోక్ చవాన్ ద్వారా ఈ కేసు విచారణలో సిబిఐ పురోగతి సాధించినట్లయితే మున్ముందు కాంగ్రెస్ పార్టీ చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి రావచ్చును.