కోర్టు తీర్పు మున్సిపల్ ఎన్నికలకు అనుకూలంగా ఉంటుందని గట్టిగా నమ్ముతున్న టీఆర్ఎస్ సర్కార్… ఏర్పాట్లలో బిజీగా ఉంది. పార్టీ పరంగానూ ఇప్పటికే సన్నాహాలను ఫుల్ స్వింగ్‌లో ఉంచుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పడిప్పుడే.. జవసత్వాలను కూడగట్టుకునే ప్రయత్నంలోఉంది. మున్సిపల్ ఎన్నికలు ముంచుకొస్తుండటంతో హస్తం పార్టీ అలెర్ట్ అయింది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కోవడానికి ప్రిపేర్ అవుతోంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల పై వ్యూహరచన చేయడానికి టి. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాభాకర్ అధ్యక్షతన ఏఐసీసీ కార్యదర్శులు సంపత్ కుమార్, వంశీచంద్ రెడ్డి సభ్యులుగా కమిటీ వేసింది.
జూన్ 29న నాగార్జున సాగర్ లో రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించిన టీపీసీసీ మున్సిపల్ ఎన్నికల సమాయత్తం మీద సుదీర్ఘంగా చర్చించింది. అందులో భాగంగా జులై 1 నుంచి 4 వ తేదీ వరకు జిల్లా కార్యవర్గ సమావేశాలు, 5 నుంచి 10వరకు మున్సిపల్ స్థాయిల్లో కమిటీల సమావేశాలు పెట్టి ఎన్నికల మీద చర్చించారు. ఇన్‌చార్జులు లేని 38 నియోజక వర్గాలకు కొత్తవారిని నియమించారు. 138 మున్సిపాలిటీలకు పీసీసీ కార్యవర్గంలోని ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, అధికార ప్రతినిధులకు సమన్వయ కర్తలుగా బాధ్యతలు అప్పగించారు. అయితే.. వీరందర్నీ క్రియాశీలకంగా పని చేయించుకోవడమే.. కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది.
ఇక పార్టీలోని ముఖ్య నాయకులందరికి వారి వారి జిల్లాలోని మున్సిపాలిటీల బాధ్యతలు అప్పగించారు. రంగారెడ్డి, నల్గొండ పూర్వజిల్లాలోని 40 మున్సిపాలిటీల మీద రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టాలని సాగర్ సమావేశంలో నిర్ణయించారు. మొత్తానికి స్థానిక ఎన్నికల్లో చతికిల పడ్డ కాంగ్రెస్ పట్టణాల్లో పట్టు నిలుపుకోవాలనే పట్టుదలతో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. మరి టీఆర్ఎస్ దూకుడును అడ్డుకోగలిగే శక్తిని.. కాంగ్రెస్ సంపాదించుకుంటో లేదో.. ఊహించడం కష్టమే… !