కర్ణాటకలో ప్రభుత్వాన్ని నిలుపుకోవడానికి కాంగ్రెస్ – జేడీఎస్ సంకీర్ణం… ఆఖరి అస్త్రాన్ని వాడే ప్రయత్నంలో పడింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అత్యధిక తిరుగుబాటుదారులు కావడంతో.. ముఖ్యమంత్రి పీఠాన్ని.. కాంగ్రెస్ పార్టీకే అప్పగిస్తే.. వారంతా తిరిగి వస్తారన్న అంచనాతో… ఈ దిశగా.. రాజకీయాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే దేవేగౌడతో.. కాంగ్రెస్ పార్టీ నేతలు సంప్రదింపులు జరిపారు. దేవేగౌడ కూడా.. ఇప్పుడున్న సంక్షోభంలో పార్టీని కాపాడుకోవాలంటే… కాంగ్రెస్ పార్టీ నేత ముఖ్యమంత్రి అయినా అభ్యంతరం లేదని చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలోనూ దీనిపై అంతర్గతంగా కసరత్తు జరుగుతోంది. కుమారస్వామి కూడా.. వైదొలిగి.. కాంగ్రెస్ పార్టీకి సీఎం పీఠం అప్పగించడానికి సిద్ధంగానే ఉన్నారంటున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో.. ఎమ్మెల్యేలను.. ఒకే తాటిపైకి తీసుకువచ్చి.. అందర్నీ కలిపి ఉంచే శక్తి.. టాస్క్ మాస్టర్ గా పేరొందిన.. సీనియర్ నేత డీకే శివకుమార్‌కు ఉందని.. అందరూ ఏకగ్రీవంగా ఓ అభిప్రాయానికి వచ్చారు. సంక్షోభం ప్రారంభయినప్పటి నుంచి డీకే శివకుమార్.. ప్రభుత్వాన్ని కాపాడటానికి అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. రెబల్ ఎమ్మెల్యేలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి ఆయనతో ఎమ్మెల్యేలు మాట్లాడితే మనసు మార్చుకుంటారన్న కారణంగానే… ముంబై క్యాంపులో.. వారిని ఎవరికీ అందకుండా.. బీజేపీ నేతలు ఉంచినట్లుగా చెబుతున్నారు. అసెంబ్లీకి హాజరైతే.. శివకుమార్.. వారిని గ్రిప్‌లో పెట్టేసుకుంటాడని.. వీలైనంత వరకు.. వారి రాజీనామాలను ఆమోదింపచేయడమో.. లేక.. గైర్హాజరు కావడమో చేయాలన్న లక్ష్యంతోనే బీజేపీ ఉంది. దాన్నే ఇప్పటి వరకూ అమలు చేస్తోంది.
ఇప్పుడు డీకే శివకుమార్ ను.. ముఖ్యమంత్రిని చేస్తే.. చాలా మంది.. ఆయనకు మద్దతు ఇస్తారన్న ప్రచారం కర్ణాటకలో ఉద్ధృతంగా సాగుతోంది. ఆ చాణక్యం శివకుమార్ కు ఉంది. అయితే.. అధికార మార్పిడి జరగాలి అంటే.. కచ్చితంగా… గవర్నర్ సహకారం కావాలి. కుమారస్వామి.. పదవి నుంచి దిగిపోతే.. గవర్నర్ కచ్చితంగా చాన్స్… యడ్యూరప్పకే ఇస్తారని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు మరింత రాజకీయ డ్రామా పండుతుంది. మొత్తానికి కర్ణాటకంలో కాంగ్రెస్ – జేడీఎస్ సంకీర్ణం చివరి అస్త్రాన్ని వాడటానికి రెడీ అయిపోయారు.