తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన ఊరు .. చింతమడకను బంగారు తునక చేయబోతున్నారు. ఈ మేరకు ఇంటికి రూ.పది లక్షల రూపాయలు పంచేలా ఏర్పాట్లు చేసేశారు. ఊరంతా అత్యాధునిక డబుల్ బెడ్ రూం ఇళ్లతో అలరారేలా ఆదేశాలు జారీ చేశారు. పుట్టిన ఊరంటే.. కేసీఆర్ కు ఎంతో ఇష్టం. ఆయన ఏడాదిలో ఒకటి, రెండు రోజులు కూడా అక్కడ గడపడం కష్టమే అయినా.. తన ఓటును మాత్రం ఆ గ్రామంలోనే ఉంచుకున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా అక్కడికి వెళ్లి వేస్తూంటారు. అందుకే.. ఆ గ్రామాన్ని సమూలంగా అభివృద్ధి చేయాలనుకున్నారు. ఏమేం చేయాలో ముందుగానే సర్వే చేయించి.. ముహుర్తం ఫిక్స్ చేసుకుని అక్కడికి వెళ్లిపోయారు. సొంత గ్రామ ప్రజలపై వరాల వర్షమే కురిపించారు.
చింతమడకలో ప్రతి ఇంటికి రూ.10 లక్షల చొప్పున సాయం అందేలా పథకం రూపొందిస్తామని. .. దాని కోసం.. రూ.200 కోట్లు మంజూరు చేస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాబోయే రోజుల్లో వరి నాటు యంత్రాలకు బాగా గిరాకీ ఉంటుందన్నారు. ట్రాక్టర్లు, కోళ్ల ఫారాలు, వ్యవసాయ పరికరాలు..ఏవైనా కొనుక్కోండని.. సలహా ఇచ్చారు. చింతమడక గ్రామానికి 1500 నుంచి 2 వేల ఇళ్లు మంజూరు చేసి.. ఆరు నెలల్లో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రకటించారు. ఇళ్లపై సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేసుకోవాలని..కార్తీక మాసంలో గృహప్రవేశాలు ఉంటాయని ప్రకటించేశారు. చింతమడక గ్రామానికి ఎంత చేసినా తక్కువేనన్నారు. ఇప్పటికిప్పుడు.. చింతమడక అభివృద్ధి కోసం కలెక్టర్ నిధికి రూ.50 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. పక్కనే ఉన్న గూడూరు, తోర్నాల, పున్నూరు గ్రామాలకు రూ. కోటి చొప్పున నిధులు, రంగనాయక చెరువు అభివృద్ధికి రూ.5 కోట్లు, దుబ్బాక పట్టణ అభివృద్ధికి రూ.10 కోట్లు మంజూరు చేశారు కేసీఆర్.
చింతమడక గ్రామస్తులకు ఉచితంగా వైద్యపరీక్షలు నిర్వహించి.. చింతకమడక హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తామని ప్రకటించారు. గ్రామంలో మూడు, నాలుగు నెలల్లో అభివృద్ధి పనులు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. చింతమడకు వచ్చిన తర్వాత కేసీఆర్ పెద్దమ్మ దేవాలయం, శివాలయంలో కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.