బలహీనవర్గాల వారిని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే సంచలనాత్మక నిర్ణయాలను.. ఏపీ సర్కార్ చట్టబద్ధం చేయడానికి ముందడుగు వేసింది. ఏపీ ప్రభుత్వం ఇవాళ ఆరు కీలక బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టింది. శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు, స్ధానికులకు పరిశ్రమల్లో 75శాతం కోటా కల్పన, మహిళలకు 50 శాతం నామినేటెడ్ పదవులు, 50 శాతం ప్రభుత్వ నామినేషన్ పనుల కేటాయింపు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం నామినేటెడ్ పదవులు, 50 శాతం ప్రభుత్వ కాంట్రాక్టుల కేటాయింపు ఉన్నాయి. ఈ బిల్లులు పాసవడం లాంఛనమే. పీపీపీ ప్రాజెక్టులు కింద చేపట్టిన పరిశ్రమలు లేదా ఫ్యాక్టరీలు, జాయింట్ వెంచర్లు, ప్రాజెక్టుల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇస్తారు. పరిశ్రమలకోసం భూములు కోల్పోయినవారికి, ఇతర నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాల కోసం చట్టాన్ని రూపొందించామని ప్రభుత్వం ప్రకటించింది.
అలాగే.. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీల ఆర్థిక అభ్యున్నతికి మరో భారీ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం నామినేషన్ పద్దతిలో ఇచ్చే కాంట్రాక్టులు, సర్వీసు కాంట్రాక్టుల్లో 50 శాతం ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకే ఇవ్వాలని నిర్ణయించారు. దీని కోసం బిల్లును ఆమోదించనున్నారు. అంతే కాదు.. ఇందులో మళ్లీ యాభై శాతం మహిళలకు కేటాయించారు. మహిళల ఆర్థికాభివృద్ధికి ఇవి ఎంతో ఉపయోగపడతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అలాగే… ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లోనూ 50శాతం ఇవ్వనున్నారు. ఈ సమావేశాల్లోనే బిల్లులను ఆమోదించనున్నారు.
నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ పద్దతిలో ఇచ్చే కాంట్రాక్టుల్లో.. ఇప్పటి వరకూ.. కుల, మతాలు చూసేవారు కాదు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే.. ఆ ప్రభుత్వానికి చెంది నేతలకు .. పదవులు.. కాంట్రాక్టులు దక్కేవి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ పరిస్థితి మార్చబోతున్నారు. బిల్లులు చట్టంగా అయిన వెంటనే… ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు యాభై శాతం పదవులు, కాంట్రాక్టులు దక్కుతాయి. దాంతో వారు ఆర్థికంగా మెరుగుపడే పరిస్థితి ఉంటుంది.