అమరావతికి రుణం ఇవ్వడానికి నిరాకరించిన ప్రపంచ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య రంగానికి మాత్రం.. 328 మిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించింది. అంగీకరించడమే కాదు… ఇచ్చేసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన నవరత్నాల పథకానికి ఎంతో ఆకర్షితులైన ప్రపంచ బ్యాంక్ బృందం మే 27న లోన్ మంజూరు చేసినట్లుగా.. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. రికార్డుల పరంగా.. అదే సమాచారాన్ని సభ్యులకూ పంచారు. ఇది జగన్మోహన్ రెడ్డిపై ఉన్న నమ్మకమని కూడా అర్థిక మంత్రి చెబుతున్నారు. అమరావతి రుణం ఆగిపోవడానికి టీడీపీ సర్కార్ నిర్వాకమే కారణమన్నారు. అయితే.. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాదని… అంత కంటే.. ముందే రుణం మంజూరు అయిందని.. తెలుగుదేశం పార్టీ నేతలు డాక్యుమెంట్లు విడుదల చేశారు.
ఏపీ హెల్త్ కేర్ సిస్టమ్స్ ప్రాజెక్ట్ కు రుణం కోసం గతంలో ఏడాదిగా ప్రయత్నించిన ఏపీ సర్కార్ కు.. చివరికి.. మే 15వ తేదీన ప్రపంచబ్యాంక్ తీపి కబురు చెప్పింది. రుణ ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసింది. అయితే.. మే 23వ తేదీన ఎన్నికల కౌంటింగ్ జరిగింది. ఆ తర్వాత వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు.. జూన్ 27న ఏపీ సర్కార్ నవరత్నాలను చూసి.. ప్రపంచబ్యాంక్ రుణం ఇచ్చిందని.. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి.. నేరుగా అసెంబ్లీలోనే క్లెయిమ్ చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య రంగంలో గత నాలుగైదేళ్ల కాలంలో బాగా మెరుగుపడింది.
2016-17, 2017-18 సంవత్సరాల్లో రాష్ట్రాలు వివిధ రంగాల్లో సాధించిన ప్రగతి ఆధారంగా నీతీ ఆయోగ్ ప్రకటించిన ర్యాంకుల్లో ఆంధ్ర ప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహకారంతో, ప్రపంచ బ్యాంకు సహాయంతో అధ్యయనం నిర్వహించి ర్యాంకులు ఇచ్చింది. ఇక్కడ మెరుగైన ఫలితం కనబర్చడంతోనే… ప్రపంచబ్యాంక్ రుణం మంజూరు అయింది. ఈ క్రెడిట్ ను అసెంబ్లీ సాక్షిగా.. జగన్ నవరత్నాల ఖాతాలో వేసేశారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.