ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ లోకి వలసలు జోరు గా కొనసాగుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీల నుండి వలసలు ఉన్నప్పటికీ, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీని బీజేపీ ఫోకస్ చేస్తోంది. పైగా, కాస్తో కూస్తో కేసులు ఉన్న నాయకులు ఈజీ గానే బీజేపీ వలకు చిక్కుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు బీజేపీ కేంద్ర పెద్దలకు టచ్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆయన బీజేపీలో చేరడానికి పరిస్థితులు కాస్త సుముఖంగానే ఉన్నప్పటికీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆయన చేరికను అడ్డుకుంటున్నట్లుగా సమాచారం. దీంతో, గతంలో వీరిద్దరి మధ్య ఉన్న విభేదాలు, వీరిద్దరి మధ్య నడిచిన తారా చౌదరి ఎపిసోడ్ దీనికి కారణం ఏమో అన్న సందేహాలు వస్తున్నాయి.
కన్నా లక్ష్మీనారాయణ , రాయపాటి సాంబశివ రావు ల మధ్య విబేధాలు ఈనాటివి కాదు. ఒకే పార్టీలో ఉన్నప్పుడు సైతం వారి మధ్య రాజకీయ విభేదాలు ఉండేవి. అయితే వీటికి పరాకాష్ట 2012లో జరిగిన తారా చౌదరి ఎపిసోడ్. అప్పట్లో రాష్ట్రాన్ని ఒక ఊపు ఊపేసిన ఈ ఎపిసోడ్లో, తారా చౌదరి వద్ద పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రమే కాకుండా ఎంతో మంది సెలబ్రిటీల బాగోతాలు ఆడియో టేపులలో, వీడియో టేపుల లో నిక్షిప్తమై ఉన్నాయి అన్న వార్త రాష్ట్రంలో సంచలనం రేపింది. కొన్ని వారాల పాటు మీడియాని ఈ ఎపిసోడ్ పూర్తిగా ఆక్రమించింది. అయితే అప్పట్లో వ్యవసాయ మంత్రిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ కు సంబంధించిన ఆడియో ఒకటి తారా చౌదరి వద్ద ఉందన్న వార్త గుప్పుమంది.కానీ ఆ తర్వాత, ఆవిడ వద్ద కన్నా లక్ష్మీనారాయణ కి సంబంధించిన ఎటువంటి ఆడియో లేదని, కన్నా లక్ష్మీనారాయణ పేరు ఈ వ్యవహారంలో ఇరికించడానికి అప్పట్లో ఎంపీగా ఉన్న రాయపాటి సాంబశివరావు తార కు 50 లక్షలు ఇచ్చాడని మరొక వార్త గుప్పుమంది. ఈ రెండు వార్తల లో ఏదైనా నిజం ఉందా లేక రెండు అబద్ధాలేనా అని తెలియకుండా ఆ సమస్య సమసిపోయింది. రాయపాటి సాంబశివరావు మాత్రం తనని ఒక ఎంపీ గా కలవడానికి ఎంతో మంది వస్తుంటారని అటువంటి వారిలో తారా చౌదరి ఒకరని, ఆ విధంగా ఆమెను కలిసానే తప్పించే వ్యక్తిగతంగా ఎటువంటి సంబంధం లేదని వ్యాఖ్యానించారు. కన్నా లక్ష్మీనారాయణ మాత్రం తనని ఇరికించడానికి చేసిన ప్రయత్నం వికటించిందని వ్యాఖ్యానించారు. మొత్తం మీద రాయపాటి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణ ల మధ్య అలా కొంతకాలం పాటు మాటల యుద్ధం నడిచింది. ఆ తర్వాత నెమ్మదిగా తారాచౌదరి వ్యవహారం సద్దు మణిగిపోయింది.
ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. రాయపాటి సాంబశివరావు టీడీపీలో చేరిపోతే కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలో చేరి పోయారు. ఇప్పుడు బీజేపీ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఇక రాయపాటి సాంబశివరావు మీద అప్పట్లో పోలవరం పనులలో ట్రాన్స్ ట్రాయ్ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో టీడీపీ మీద రాజకీయ కక్ష సాధింపు చర్యలా బీజేపీ గనక పాత వ్యవహారాలన్నింటినీ తీస్తే తమకు ఇబ్బంది కలుగుతుంది అనుకున్న నాయకులు చాలామంది బీజేపీ లో చేరిపోవడానికి సిద్ధపడుతున్నారు అంటూ విశ్లేషణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల టీడీపీ నుండి బీజేపీ లోకి ఫిరాయించిన నేతలు రాయపాటి సాంబశివరావు ని సైతం బీజేపీలోకి లాగడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారని, రాయపాటి సాంబశివరావు కూడా ఇందుకు సుముఖంగానే ఉన్నారని, కానీ తారా చౌదరి ఎపిసోడ్ కారణంగానో, లేదంటే పాత రాజకీయ విబేధాల కారణంగానో, లేదంటే మరింకే కారణంతోనో కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాయపాటి చేరికకు సుముఖంగా లేరని రాజకీయవర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
మొత్తానికి రాయపాటి చేరికను కన్నా నిజంగానే అడ్డుకుంటారా, లేదంటే బీజేపీలో విజయవంతంగా చేరిపోయి కన్నా నేతృత్వంలో రాయపాటి పని చేస్తారా అన్నది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాలి.