ఎన్నికల ముందు ఇచ్చిన మరో కీలక హామీలపై నిర్ణయం ప్రకటించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం కోటా కల్పించారు. ఇది కచ్చితంగా మంచి నిర్ణయమే. ఎందుకంటే, స్థానికంగా పరిశ్రమలు ఉండి… ఉపాధి కోసం యువత వలసలు పోయే పరిస్థితికి కొంతవరకూ చెక్ పడుతుంది. అలాగే, పరిశ్రమల రాక కారణంగా భూములు కోల్పోయినవారు కూడా తమ వారికి స్థానికంగానే ఉపాధి దక్కుతుందనే ఆనందం కూడా ఉంటుంది. అయితే, ఈ నిర్ణయాన్ని సక్రమంగా అమలు చేసి, దీని ద్వారా పూర్తిస్థాయిలో లబ్ధి అందరికీ దక్కాలంటే… ప్రభుత్వం మరికొన్ని కీలక అంశాలపై కూడా కచ్చితంగా దృష్టి సారించాల్సి ఉంటుంది.
పరిశ్రమల్లో ఆయా ప్రాంతాలకు చెందినవారికే 75 శాతం ఉద్యోగాలు అన్నారు బాగుంది! కానీ, ఆ ఉద్యోగాలు పొందేందుకు కావాల్సిన అర్హతలను స్థానికుల్లో పెంచే దిశగా కూడా ప్రభుత్వమే చొరవ తీసుకోవాలి. అంటే, స్కిల్ డెవలప్మెంట్ లాంటి కార్యక్రమాలు. స్కిల్ ఉన్న మేన్ పవర్ గ్రామీణ ప్రాంతాల్లోనే లభిస్తే ఏ కంపెనీలైనా హాయిగా తీసుకుంటాయి. అయితే, ఇక్కడ సమస్యంతా నైపుణ్యాల దగ్గరే వస్తోంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా 75 శాతం ఉద్యోగాలు వారికే ఇవ్వాలంటే… అదే స్థాయిలో స్థానికుల్లో నైపుణ్యాలు పెంచే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకోవాలి. లేదా, ఆయా కంపెనీలకే స్థానికులకు స్కిల్స్ పెంచే కార్యక్రమాలు చేపట్టేలా ఆదేశించాలి. ఉదాహరణకు హైదరాబాద్ తీసుకుంటే… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎన్నో సాఫ్ట్ వేర్ కంపెనీలు వచ్చాయి. కానీ, ఆయా కంపెనీల్లో స్థానికుల కంటే ఇతర రాష్ట్రాలకు చెందినవారే ఎక్కువగా ఉన్నారు.
ప్రైవేటు సంస్థలకు స్కిల్ ఒక్కటే ముఖ్యం. ఉద్యోగాలు స్థానికులకు ఇస్తున్నామా, ఇతరులకు ఇస్తున్నామనే అనే ప్రాథమ్యం వారికి ఉండదు. ఇది ప్రభుత్వ నిర్ణయం కాబట్టి, ఇది పక్కాగా అమలు జరిగితే… గ్రామీణ ప్రాంతాలు బాగుపడే అవకాశం ఉంది కాబట్టి, నైపుణ్యాల పెంపుదలపై కూడా ప్రభుత్వమే చొరవ తీసుకోవాలి. నిజానికి, ఈ నిర్ణయం ప్రభుత్వం ప్రకటించక ముందే… అధికారుల నుంచి కొన్ని అభ్యంతరాలు వ్యక్తమైనట్టు సమాచారం! గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యాల లభ్యత, ఈ 75 శాతం నిబంధనలకు ప్రైవేటు సంస్థలు ఒప్పుకుని ముందుకొస్తాయా… ఇలాంటి కొన్ని అంశాలపై మరింత అధ్యయనం చేయాలని అధికార వర్గాలు అభిప్రాయపడ్డాయని సమచారం. కానీ, ఎలాగైనా అమలు చేసి తీర్సాల్సిందే అదే వాదన నాయకులు వినిపించారనీ కొంతమంది అధికారులు చెబుతున్నారు.