తెలంగాణలో బోనాలు, బతుకమ్మ పండుగల్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. ఆషాడ మాసం వచ్చిందే, ముఖ్యంగా హైదరాబాద్ లో బోనాల సందడి మొదలౌతుంది. దాదాపు నెలరోజులపాటు ఈ సంబరాలు ఉంటాయి. ఈ బోనాల పండుగల్లో రాజకీయ నాయకులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనడం మొదట్నుంచీ ఉంది. అయితే, ఈ బోనాలూ బతుకమ్మలు అనగానే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది ముఖ్యమంత్రి కుమార్తె, మాజీ ఎంపీ కవిత. తెలంగాణ జాగృతి పేరుతో ప్రతీయేటా పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలకు నిర్వహిస్తుంటారు. విదేశాలకు కూడా వెళ్తుంటారు. అయితే, ప్రస్తుత సంబరాల్లో ఆమె హడావుడి కనిపించడం లేదు. గతంలో మాదిరిగా సందడి చేయడం లేదు. దీనిపై తెరాస వర్గాల్లో కొంత చర్చ జరుగుతోంది.
లోక్ సభ ఎన్నికల్లో ఓటమి తరువాత ఆమె హైదరాబాద్ లోని నివాసానికే పరిమితం అవుతున్నారు. ఓటమి తరువాత సొంత నియోజక వర్గం నిజామాబాద్ కి వెళ్లి, అక్కడ పార్టీ శ్రేణులతో విశ్లేషించిందీ లేదు. ఒక కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి మాత్రమే ఒక్కసారి వెళ్లారంతే! ఇప్పుడు, పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతోంది. చిన్నా పెద్దా అని తేడా లేకుండా తెరాస నాయకులందరికీ లక్ష్యాలు ఇచ్చిమరీ సభ్యత్వాలను చేర్పిస్తున్నారు. కానీ, కవితకు ఆ బాధ్యతల్లో కూడా భాగం ఇవ్వలేదు! చివరికి, ఆమె సభ్యత్వాన్ని కూడా హైదరాబాద్ వచ్చి… పార్టీ నేతలు ఇచ్చి వెళ్లిన పరిస్థితి ఉంది! అందరికీ పార్టీ బాధ్యతలు అప్పగిస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సోదరి విషయమై ఎందుకు స్పందించడం లేదు అనే చర్చా తెరాస వర్గాల్లో మొదలైనట్టు సమాచారం.
ఎంపీగా ఓటమి తరువాత ఆమె కొంత నైరాశ్యానికి గురయ్యారనీ, అందుకే ఏ కార్యక్రమంపైనా పెద్దగా ఆసక్తి చూపడం లేదని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. తాజాగా బోనాల పండుగలో కూడా ఆమె చురుకైన పాత్ర తీసుకోవడం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది. తెలంగాణ జాగృతిని గతంలో మాదిరిగా చురుగ్గా పనిచేసేలా మార్చాలనీ, తెరాసకు సాంస్కృతికంగా ఈ విభాగం వల్ల చాలా మేలు జరిగిందనీ, దాన్ని నిర్లక్ష్యం సరికాదనే అభిప్రాయాన్ని కొంతమంది నేతలు వెల్లడిస్తున్న పరిస్థితి..! ఈ అభిప్రాయాలన్నీ ముఖ్యమంత్రి వరకూ చేరాయో లేదో మరి..?