తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ ని సక్సెస్ ఫుల్ గా ముందుకు తీసుకెళ్తోంది భాజపా. ఒక్కొక్కరుగా పార్టీలోకి చేర్చుకుంటూ, నాయకుల బలాన్ని పెంచుకునే ప్రయత్నంలో ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు మాజీ ఎంపీ వినోద్ భాజపాలో చేరుతున్నారు. కేంద్ర హోం మంత్రి, భాజపా అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆయన మంగళవారం మధ్యాహ్నం పార్టీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. గత ఎన్నికల్లో తెరాస నుంచి ఆయన ఎంపీ టిక్కెట్ ఆశించారు. కానీ, సీటు దక్కకపోవడంతో అప్పట్నుంచీ అసంతృప్తితో ఉన్నారని టాక్. దాంతో, ఈయన పార్టీ మార్పు ఉంటుందనేది ముందు నుంచీ ఊహిస్తున్నదే. వివేక్ తోపాటు ఆయన సోదరుడు వినోద్ కూడా భాజపాలో చేరతారనే కథనాలూ వినిపిస్తున్నాయి.
2014లో పెద్దపల్లి పార్లమెంటు నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వివేక్ ఎన్నికల్లో నిలబడ్డారు. కానీ, తెరాస అభ్యర్థి బాల్క సుమన్ చేతిలో ఆయన ఓడిపోయారు. ఆ తరువాత, తెరాసలో చేరారు. ప్రభుత్వ సలహాదారుగా మంచి గుర్తింపే తెరాసలో లభించింది. అయితే, గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బాల్క సుమన్ పోటీ చేశారు. దీంతో పెద్దపల్లి పార్లమెంట్ టిక్కెట్ కు ఎవరూ లేరు, తనకే కచ్చితంగా ఇస్తారనే అనే ధీమాతో వివేక్ వ్యవహరించారు. కానీ, తీరా లోక్ సభ ఎన్నికలు వచ్చేసరికి… వినోద్ కి టిక్కెట్లు ఇవ్వలేదు తెరాస! దీంతో అప్పట్నుంచే ఆయన తెరాస తీరుపై గుర్రుగా ఉన్నారని సమాచారం.ఆయనకి టికెట్ రాకపోవడానికి సోదరుడు వినోద్ వ్యవహార శైలి కూడా ఒక కారణం అనే కథనాలు వచ్చాయి.
ప్రస్తుతం ఆయన భాజపాలో చేరడం వల్ల వినోద్ కంటే… భాజపాకే ఎక్కువ లాభం ఉందని అనొచ్చు! ఎందుకంటే, తెలంగాణలో భాజపాకి సొంత మీడియా అంటూ ఇంతవరకూ ఏదీ లేదు. అధికార పార్టీకి వెన్నుదన్నుగా కొన్ని మీడియా సంస్థలు వ్యవహరిస్తున్నాయి. తెరాస తరువాత తామే అనే స్థాయిలో వాణిని వినిపించాలంటే, సొంత మీడియా అవసరం భాజపాకి ఎంతైనా ఉంది! ఇప్పుడు వినోద్ రాకతో ఒక న్యూస్ ఛానెల్, ఒక పత్రిక భాజపాకి అండగా నిలిచేందుకు లభించినట్టే! ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీని యుద్ధ ప్రాతిపదిక బలోపేతం చేయాలంటే, సొంత మీడియా చాలా వరకూ ప్రయోజనకరంగా మారుతుంది.