ఏపీ గవర్నర్ గా నరసింహన్ హయాం ముగిసింది. బ్యూరోక్రాట్ అయిన నరసింహన్… పదవీ విరమణ తర్వాత గవర్నర్ గా నియమితులై.. పన్నెండేళ్లకుపైగా .. విధులు నిర్వహించారు. ఇది భారత దేశ రాజకీయాల్లో అసాధారణమైన విషయం. గవర్నర్ పదవికి… రాజకీయానికి పైకి సంబంధం ఉండదు. కానీ.. గవర్నర్ పదవి రాజకీయంతోనే ముడిపడి ఉంటుంది. అలాంటిది… కాంగ్రెస్ హయాంలో నియమితులై… బీజేపీ హయాంలో.. పదవీకాలం ముగిసిన తర్వాత పొడిగింపు పొంది మరీ కొనసాగడం… అసాధారణ విషయం. ఇది నరసింహన్ కే సాధ్యమయింది.
రాజకీయాలను కాచి వడబోసిన బ్యూరోక్రాట్..!
తమిళనాడుకు చెందిన నరసింహన్.. మొదట ఐపీఎస్ అధికారి. 1968 బ్యాచ్‌కు చెందిన ఆయన… ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందినవారు. ఆంధ్రప్రదేశ్‌లో కంటే..కేంద్ర సర్వీసుల్లోనే ఆయన ఎక్కువగా పేరు తెచ్చుకున్నారు. కేంద్ర ఇంటిలిజెన్స్ బ్యూరో చీఫ్ గా పని చేస్తూ రిటైరయ్యారు. అప్పటి ప్రభుత్వ పెద్దలకు బాగా సన్నిహితంగా ఉండటంతో… రిటైరైన వెంటనే.. ఆయనను మాస్కోలో భారత ప్రభుత్వ రాయబారిగా నియమించారు. ఆ తర్వాత చత్తీస్ ఘడ్ గవర్నర్ గా నియమితులయ్యారు. జనవరి 25 2007 లో చత్తీస్‌గఢ్ గవర్నర్ బాధ్యతలు చేపట్టారు. 2009 ఆఖరులో.. ఏపీ గవర్నర్ గా ఉన్న నారాయణ్ దత్ తివారీ వివాదాస్పద వ్యవహారశైలి కారణంగా.. గవర్నర్ పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఆ సమయంలో.. చత్తీస్ఘడ్ గవర్నర్ గా ఉన్న నరసింహన్‌కు..కేంద్రం అదనపు బాధ్యతలు ఇచ్చింది. తర్వాత చత్తీస్ ఘడ్కు వేరే గవర్నర్‌ను నియమించి.. ఆంధ్రప్రదేశ్‌కు నరసింహన్‌నే కొనసాగించింది.. అప్పటి యూపీఏ ప్రభుత్వం.
ఉమ్మడి ఏపీలోనూ వివాదాస్పద నిర్ణయాల పాత్రే..!
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమ సమయంలో.. నరసింహన్.. ఉద్యమకారుల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించారన్న విమర్శలు వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు అప్పట్లో..నరసింహన్‌నే ప్రధానంగా టార్గెట్ చేసేవారు. శాసనసభలో ఆయన ప్రసంగాన్ని కూడా అడ్డుకున్నారు. అయితే.. కేంద్రం .. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో.. గవర్నర్ దానికి అనుగుణంగా వ్యవహరించారు. రాష్ట్ర విభజన కోసం.. జరగాల్సిన ప్రక్రియలో గవర్నర్ కీలకంగా వ్యవహరించారని చెబుతారు. వివిధ రకాల నివేదికలు పంపడంతో పాటు… అసెంబ్లీలో తీర్మానం కోసం పంపిన ముసాయిదా బిల్లు.. ఇతర అంశాల విషయంలో గవర్నర్ తనదైన పాత్ర పోషించారు. అంటే.. మొదట్లో.. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా వ్యవహరించారని.. విమర్శలు ఎదుర్కొన్న .. నరసింహన్.. ఆ తర్వాత రాష్ట్ర విభజనలో కీలక పాత్ర పోషించారు. అయినా రెండు రాష్ట్రాల్లోనూ పదవిని నిలబెట్టుకున్నారు.
ఎవరు అధికారంలో ఉంటే వారికి విశ్వాసపాత్రుడు..!
నరసింహన్.. లౌక్యం కలిగిన గవర్నర్. ఆయన బ్యూరోక్రాట్ అయినప్పటికీ.. రాజకీయాన్ని నరనరా ఒంటబట్టించుకున్నారని.. తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతలు చెబుతూ ఉంటారు. కాంగ్రెస్ హయాంలో నియమితులైన ఏ గవర్నర్ కూడా.. బీజేపీ వచ్చిన తర్వాత ఎక్కువ కాలం పదవిలో ఉండలేదు. పొడిగింపులు పొందిన వారు.. అస్సల్లేరు. ఒక్క నరసింహన్ మాత్రమే దానికి మినహాయింపు. కాంగ్రెస్ కు ఆత్మీయుడిగా పదవి పొందిన ఆయన.. బీజేపీ రాగానే.. ఆ పార్టీ పెద్దలకు ఆత్మీయుడైపోయారు. కేంద్ర ప్రభుత్వంలో సూపర్ పవర్ గా ఉన్న అజిత్ ధోవల్‌తో ఉన్న సాన్నిహిత్యమే… గవర్నర్ కొనసాగింపునకు కారణం అని చెబుతున్నా… బీజేపీ అవసరాలకు తగ్గట్లుగా.. రాజకీయాలు మారేలా.. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని కీలకమైన చర్యలు చేపట్టడంలోనూ ఆయన సఫలీకృతమయ్యారు. అందుకే.. బీజేపీ పెద్దల అభిమానాన్ని పొందారు.
రాజ్ భవన్ వేదికగా రాజకీయం చేసిన రికార్డ్..?
తెలుగు రాష్ట్రాల్లో కొంత మంది పట్ల వ్యతిరేకతతో వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పట్ల.. ఏపీలో టీడీపీ పట్ల.. ఆయన రాజకీయ కుట్రలు చేశారన్న విమర్శలు వచ్చాయి. రాజ్ భవన్ కేంద్రంగా రాజకీయాలు నడిపిన మచ్చ కూడా ఆయనపై ఉంది. బీజేపీతో.. టీడీపీ సంబంధాలు చెడిపోయిన సమయంలో.. ఆయన పాలనలో జోక్యం చేసుకునే ప్రయత్నం కూడా చేశారన్న ఆరోపణలు వచ్చాయి. గవర్నర్ పై..నేరుగా.. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు చాలా ఆరోపణలు చేశారు. అయినా గవర్నర్ ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. ఆయన చేయాల్సిన రాజకీయం చేశారు.
ఆలయాలకు రద్దీ తగ్గినట్లేనా..?
అదే సమయంలో.. ఆయన తన భక్తి పర్యటనలకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలకు కొదవలేదు. ఏ వీఐపీ కూడా.. దర్శించుకోనన్ని సార్లు తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఉంటారు. సామాన్య భక్తులకు ఇబ్బంది అవుతుందని ఎన్ని సార్లు విమర్శలు వచ్చినా ఆయన ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. ఒక్క తిరుమల విషయంలోనే కాదు.. ఆయన ఏపీలోని అన్ని ఆలయాలను ఆయన పదుల సంఖ్యలో దర్శించుకుని ఉంటారు. దీనిపై విమర్శలు వచ్చినా ఆయన లెక్క చేయరు. పలుమార్లు భక్తుల నుంచే ప్రశ్నలు వచ్చినా… ఆయనేమీ ఓట్ల కోసం వారి వద్దకు వెళ్లే వ్యక్తి కాదు కాబట్టి ఎప్పుడూ లక్ష్య పెట్టలేదు. మొత్తానికి గవర్నర్ నరసింహన్ హయాంలో.. ఉమ్మడి ఏపీ… విభజనకు గురయింది. విభజన తర్వాత.. ఐదేళ్లలో ఆయన ఏపీకి ఏం చేశారో ముందు ముందు తెలుస్తోంది.