వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా విషయంలో ఎటువంటి తప్పటడుగులు వేసి అభాసుపాలయ్యారో, ఇప్పుడు ముద్రగడ పద్మనాభం కూడా సరిగ్గా అటువంటి చేదు అనుభవమే ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి అకస్మాత్తుగా ఆమరణ నిరాహార దీక్షకు కూర్చొని భంగపడ్డారు. ముద్రగడ కూడా రేపటి నుండి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోబోతున్నారు. సాధారణంగా దానిని ఉద్యమంలో ఆఖరి అస్త్రంగా ఉపయోగిస్తుంటారు. కానీ జగన్, ముద్రగడ దానిని మొదటిలోనే ప్రయోగించుతున్నారు. ఈరోజుల్లో ఆమరణ దీక్షలు ఎన్ని రోజులు సాగుతాయో, వాటికి పోలీసులు ఏవిధంగా ముగింపు పలుకుతారో అందరికీ తెలుసు. కనుక ముద్రగడ చేపట్టబోయే దీక్ష ముగింపు కూడా అదేవిధంగా ఉండవచ్చును.
కానీ నాలుగు రోజుల వ్యవధిలోనే ఆయనలో అనూహ్యంగా చాలా మార్పు కనబడుతోంది. మొదట ప్రభుత్వంపై పులిలా గర్జించిన ఆయన స్వరం ఇప్పుడు మెత్తబడింది. రిజర్వేషన్ల గురించి అడిగిన ఆయన ఇప్పుడు మంజునాద్ కమీషన్ గడువును కుదించాలని, కాపులకు ఇస్తామన్న రెండు వేల కోట్లు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఆమరణ దీక్ష చేస్తానని చెపుతూనే ప్రభుత్వంతో చర్చలకు (రాజీకి) సిద్దమన్నట్లు మాట్లాడటం వలన ఆయన చేపట్టబోయే దీక్షకి కూడా విలువ లేకుండా పోయింది. ఆయనలో ఈ అనూహ్య మార్పుకి కారణం తేలికగానే ఊహించవచ్చును.
ఉద్యమం మొదలుపెట్టిన రోజునే అది చాలా హింసాత్మకంగా మారడంతో ఆయనకు తన ఉద్యమంపై అదుపు లేదని స్పష్టమయింది. ఉద్యమకారులు రైలుకి నిప్పు పెట్టడంతో అది న్యాయస్థానాల దృష్టిలో కూడా పడింది. దానికి ఆయన తెదేపాని నిందించినప్పటికీ ఆయన ఆరోపణలను ఎవరూ విశ్వసించడంలేదు. ఆయన ఉద్యమానికి మద్దతు పలికిన వైకాపా కూడా ఈ కేసులకు భయపడో లేక బీసీలకు ఆగ్రహం కలిగించి వారిని దూరం చేసుకోవడం ఇష్టం లేకనో ఆయనకు మద్దతుగా మాట్లడుతోంది తప్ప ఎటువంటి ప్రత్యక్ష కార్యాచరణకి దిగడం లేదు.
ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చాలా ఆచితూచి వ్యవహరిస్తోంది కనుక అది కూడా ఆయనకు దూరంగానే ఉంది. అదే మంచి నిర్ణయమని తుని సంఘటనల తరువాత రుజువయింది. రెండు ప్రధాన పార్టీలు దూరంగా ఉండటం, పోలీసుల కేసులు, బీసీల ఆందోళన వంటివన్నీ ముద్రగడ పద్మనాభంకి బ్రేకులు వేసి ఉండవచ్చును. తను అరెస్టులకు భయపడనని ముద్రగడ చెపుతునప్పటికీ, కేసుల తీవ్రతను ఆయన కూడా గుర్తించినట్లే ఉన్నారు. బహుశః అందుకే ఆయన ఇప్పడు ప్రభుత్వంతో చర్చలకు సిద్దమని చెపుతున్నారనుకోవాలి.