అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెరాసను ఎలాగైనా గద్దె దించాలన్న ఉద్దేశంతో ప్రతిపక్షాలన్నీ ఒకటయ్యాయి. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్ పార్టీలు కూటమి కట్టాయి. ఆ ఎన్నికల ఫలితాలు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో… కలిసి పోరాటం అనే కాన్సెప్ట్ ని అందరూ దాదాపుగా పక్కన పడేశారు. ఎన్నికల తరువాత, ప్రభుత్వంపై ఏ నిరసన కార్యక్రమం చేపట్టినా ఎవరికి వారే అన్నట్టుగా పార్టీలు వ్యవహరించాయి. అంతర్గత సంక్షోభంలో కాంగ్రెస్, దిక్కుతోచని స్థితిలో టీడీపీ, కొత్త ఊపు తెచ్చుకునే ప్రయత్నలో టీజేయస్.. ఇలా ఎవరికి వారే అన్నట్టుగా ఉన్నారు. ఈ పార్టీలకు కామన్ వేదిక అంటూ ఇంతవరకూ ఏదీ దొరకలేదు. ఇప్పుడు మరోసారి ప్రతిపక్షాలన్నీ ఒకే వేదిక మీదికి వస్తున్నాయి. కేసీఆర్ సర్కారు మీద సమష్టిగా పోరాటానికి సిద్ధమౌతున్నాయి. సెక్రటేరియట్ కూల్చివేత, కొత్త అసెంబ్లీ నిర్మాణాన్ని నిరసిస్తూ పార్టీలన్నీ పెద్ద ఎత్తున ఓ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాయి. ఈ నెల 25న చలో సెక్రటేరియట్ నిరసన కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకున్నాయి.
జీ వెంకటస్వామి ఫౌండేషన్, ప్రజాస్వామిక తెలంగాణ వేదిక ఆధ్వర్యంలో అన్ని పార్టీలకు చెందిన నాయకులు హాజరయ్యారు. మాజీ ఎంపీ వినోద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం విశేషం! ఈ సందర్భంగా టీజేఎస్ అధ్యక్షుడు కె కోదండరామ్ మాట్లాడుతూ… తెలంగాణలో పాఠశాలల భవనాలు నిర్మించాలంటే నిధులు లేవని కేసీఆర్ సర్కారు అంటోందనీ, ఉన్న భవనాలను కూలగొట్టి కొత్తవి కట్టడానికి సిద్ధమవడం ప్రజాధనాన్ని వృథా చేయడమే అన్నారు. ఉద్యోగాల భర్తీకి డబ్బుల్లేవంటారు, ఆరోగ్య శ్రీకి పైసల్లేవంటారు, మిషన్ భగీరథ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు నిధులు చాలవంటారు. కొత్త భవనాల నిర్మాణానికి ఎక్కణ్నుంచి తెస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… చలో సెక్రటేరియట్ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులంతా పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, టీజేఎస్, ఫార్వర్డ్ బ్లాక్… ఇలా వివిధ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు.
రెండోసారి తెరాస అధికారంలోకి వచ్చాక… ప్రతిపక్షాలన్నీ ఇలా ఒకే వేదిక మీదికి వస్తున్న సందర్భం ఇదే. ప్రతిపక్షాలన్నీ భారీ నిరసనకే ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. భాజపా నుంచి ఈ కార్యక్రమానికి మద్దతు ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మాజీ ఎంపీ వినోద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది కదా. ఈ నెల 25 ప్లాన్ చేసుకున్న ఈ కార్యక్రమంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన ఉంటుందో చూడాలి. సెక్రటేరియట్ కాబట్టి ఇలాంటి కార్యక్రమాలకు సహజంగానే భద్రతాపరమైన కారణాలను చూపుతూ అనుమతులు ఇవ్వరు.