ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలు జరగలేదని.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం క్లీన్ చిట్ ఇవ్వడం సాధ్యమా..? అస్సలు ఊహించలేం. కానీ ఇది నిజం… ఏపీలో కృష్ణానది పరివాహక ప్రాంతంలో అసలు ఇసుక అక్రమ తవ్వకాలే జరగలేదని.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు.. ఏపీ ప్రభుత్వం తెలిపింది. కృష్ణానదిలో అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయంటూ.. ఏపీలో టీడీపీ సర్కార్ ఉన్నప్పుడు.. కొంత మంది ఎన్జీటీలో ఫిర్యాదు చేశారు. దానిపై ఎన్జీటీ విచారణ జరుపుతోంది. ఎన్నికల సమయంలో… రూ. వంద కోట్ల జరిమానా కూడా విధించింది. అయితే… ఏపీ సర్కార్ కోర్టుకు వెళ్లి జరిమానాపై స్టే తెచ్చుకుంది.
మరో సారి ఆ ఫిర్యాదులపై విచారణ జరుగుతూండగా.. ఏపీ సర్కార్… అనూహ్యమైన వాదన వినిపించింది. గత సర్కార్ హయాంలో.. ఎక్కడా.. కృష్ణానది తీరంలో.. అక్రమంగా ఇసుక తవ్వకాలు జరగలేదని వాదించింది. జల రవాణా కోసం ప్రకాశం బ్యారేజీ వద్ద పూడిక తీశామని మాత్రం.. తెలిపింది. ఏ ప్రాతిపదికన పూడికతీత చేపట్టారు… పర్యావరణ అనుమతులు తీసుకున్నారా? అని ఏపీ తరపు న్యాయవాదిని ఎన్జీటీ ప్రశ్నించింది. అయితే.. పూడికతీతకు పర్యావరణ అనుమతులు అవసరం లేదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. వాదనలు విన్న ఎన్జీటీ… రెండు వారాల్లో సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశించింది.
గత ప్రభుత్వంలో ఎన్నో అక్రమాలు జరిగాయని.. ఇసుక తవ్వకాలతో టీడీపీ నేతలు కోట్లు సంపాదించారని… వైసీపీ నేతలు చాలా కాలంగా ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఆ కారణంగానే… అధికారంలోకి రాగానే.. ఇసుక విధానాన్ని రద్దు చేశారు. ప్రస్తుతం.. కొత్త ఇసుక విధానాన్ని ఖరారు చేయలేదు. పరిమితంగా మాత్రమే రీచ్లకు అనుమతి ఇచ్చారు. అయితే అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో.. అసలు ఇసుక అక్రమ తవ్వకాలు లేవంటూ… నేరుగా ఎన్జీటీలోనే ఏపీ ప్రభుత్వం వాదించడం ఆసక్తి కలిగిస్తోంది.