తెలుగుదేశం పార్టీకి 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తానన్న జగన్ హామీ అస్త్రంలా దొరికింది. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేయాల్సినదంతా చేస్తోంది. పాదయాత్రలో జగన్ చేసిన ప్రకటన… వీడియోలు.. పేపర్ కటింగులు.. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇక చంద్రబాబు దగ్గర్నుంచి అందరూ… అదే టాపిక్ పట్టుకుని రంగంలోకి దిగిపోయారు. ముగ్గురు టీడీపీ ఎల్పీ ఉపనేతల్ని సస్పెండ్ చేయడంతో.. సమాధానం చెప్పలేకే చేశారంటూ బలమైన వాదన వినిపిస్తున్నారు. 45 ఏళ్లకే పింఛన్ ఇస్తామని చెప్పుకుంటూ.. జగన్ రాష్ట్రమంతా తిరిగారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఆశపడి ఓట్లు వేశారని.. జగన్ ఎందుకు మాట నిలబెట్టుకోవడం లేదని ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రశ్నల వర్షం కురిపించారు. పేదలను రూ.లక్షా 5 వేలు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీ అమలు చేయాలని అడిగితే.. ముగ్గురు డిప్యూటీ లీడర్లను సస్పెండ్ చేశారని.. ఇది పులివెందుల పంచాయితీనా అని చంద్రబాబు ప్రశ్నించారు.
ప్రతిపక్షానికి మైక్ ఇవ్వకుండా ఏకపక్షంగా అసెంబ్లీ నడుపుతున్నారని.. బీసీ నాయకుడిని సస్పెండ్ చేసి.. బీసీ బిల్లు పెట్టి ఎలా న్యాయం చేస్తారని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేక.. ఆశావర్కర్లు, అంగన్వాడీలు ఆత్మహత్య చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఆమంచి వేధింపులు తాళలేక వెంకటేశ్వర్లు అనే వ్యక్తి.. మీడియా ఎదుటే ఆత్మహత్యకు యత్నించాడని గుర్తు చేశారు. పాదయాత్రలో జగన్ 255 హామీలు… మేనిఫెస్టోలో అదనంగా 65 హామీలు ఇచ్చారని.. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని అడుగుతున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రశ్నిస్తూంటే డిప్యూటీ లీడర్లను సస్పెండ్ చేసి తప్పించుకోవాలనుకుంటున్నారని చంద్రబాబు మండిపడ్డారు. మీకు బీసీల మీద ప్రేమ ఉంటే.. బీసీ బడ్జెట్ ఎందుకు తగ్గించారో చెప్పాలన్నారు. అన్నింటిలో రిజర్వేషన్లు అంటూ మాయమాటలు చెబుతున్నారని.. దేవాదాయశాఖలో రిజర్వేషన్లు ఎందుకు పెట్టరని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో.. నాలుగేళ్లలో బీసీలకు రూ.4,800 కోట్లు పెట్టామని గుర్తు చేశారు.
జగన్ చేసేవన్నీ తప్పుడు విధానాలేనని … రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 24 వేల కోట్ల రుణమాఫీ చేసి రైతులకు భరోసా ఇచ్చామని.. చివరి విడత నిధులకు అన్ని ఏర్పాట్లు చేసినా… రుణమాఫీ విడుదల చేయకుండా రైతులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. అసెంబ్లీ జరుగుతున్న సమయంలోనే.. రోజుకు ఐదారుగురు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. టీడీపీ హయాంలో ఇసుక తీసుకోవాలంటే.. ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం ఉండేది కాదని … జగన్ వచ్చి 60 రోజులు కాకుండానే.. ఇసుక రేట్లు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. భవన నిర్మాణ కార్మికులు రోడ్డెక్కారని విమర్శలు గుప్పించారు. ఇచ్చిన హామీని అమలు చేయలేని వైసీపీ దద్దమ్మలు.. ప్రశ్నిస్తే మాత్రం రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. 45 ఏళ్లకే పెన్షన్ విషయంలో.. వైసీపీ ఇబ్బందుల్లో పడినట్లే కనిపిస్తోంది.