కర్ణాటకలో గత 45 రోజులుగా నెలకొన్న పొలిటికల్ హైడ్రామాకి తెరపడింది. అసెంబ్లీలో కుమార స్వామి ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం వీగిపోవడంతో ఆయన సీఎం పదవికి రాజీనామా చేసి తప్పుకున్నారు. అయితే, ఈ పరిణామాలపై భాజపా నాయకుడు బీఎస్ ఎడ్యూరప్ప మాట్లాడుతూ… ఇది ప్రజా విజయం అన్నారు. ఇక కర్ణాటకలో అభివృద్ధి పర్వం ఆరంభం అవుతుందన్నారు. ఇది ప్రజలు కోరుకున్న మార్పు అన్నారు. కొత్త ముఖ్యమంత్రిగా ఆయనకే అవకాశాలున్నాయన్నది తెలిసిందే. ఈ దిశగా ఇప్పుడు రాష్ట్రంలో చకచకా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
ఒక్కసారి కర్ణాటక పరిణామాలను చూస్తే… ఇది ప్రజా విజయం ఎలా అవుతుందని అనిపిస్తుంది! ముంబాయికి 15 మంది ఎమ్మెల్యేలను తరలించారు. ఓరకంగా వారి పుణ్యమా అని భాజపాకి ఇప్పుడు కర్ణాటకలో అవకాశం వచ్చిందనడంలో సందేహం లేదు. ఈ పదిహేను మందినీ అనేక ప్రలోభాలకు గురి చేశారనీ, ఒక్కొక్కరికీ రూ. 50 కోట్ల వరకూ నగదు, ఏర్పడబోయే ప్రభుత్వంలో కీలక పదవులు… ఇలా ఎన్నో రకాలుగా ఆశలుపెట్టారనే ఆరోపణలు చాలా ఉన్నాయి. కర్ణాటకలో సంకీర్ణ సర్కారును గద్దె దించేయడం కోసం గజనీ దండయాత్రలు మాదిరిగా నిరంతరాయంగా భాజపా ప్రయత్నిస్తూనే ఉంది. ఇంతవరకూ 6 సార్లు ఇలాంటి ప్రయత్నాలు చేసింది. ఇప్పుడు ఏడో ప్రయత్నంలో విజయం సాధించారు!
లోక్ సభ ఎన్నికల కంటే ముందుగానే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఫలితాల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా భాజపా స్థానాలు దక్కించుకున్నా, కాంగ్రెస్ – జేడీఎస్ సంకీర్ణం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమయంలోనే చాలా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అప్పుడు కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ఎడ్యూరప్ప ప్రయత్నించారు. గవర్నర్ ను ఒకవారం సమయం అడిగితే…. ఏకంగా రెండువారాల పాటు ఎడ్యూరప్పకు సమయం ఇచ్చారు! అప్పుడే ఎమ్మెల్యేల బేరసారాల వ్యవహారం బట్టబయలైంది. లోక్ సభ ఎన్నికలు దగ్గరుండటంతో… ఆ ఆపరేషన్ కొనసాగిస్తే విమర్శలపాలౌతామని మిన్నకున్నారు. ఆ సమయంలో బల నిరూపణ చేసుకోలేకపోయారు. తరువాత, లోక్ సభ ఎన్నికల్లో కేంద్రంలో మరోసారి భాజపా రావడంతో… ఇప్పుడు ఆపరేషన్ కర్ణాటకను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేయగలిగారు. మొన్ననే… గోవాలో భాజపా ఏం చేసిందో చూశాం. ఇవాళ్ల కర్ణాటక! ఇది ప్రజా విజయమా..? ఇంతటి రాజకీయ అనిశ్చితిని ప్రజలు కోరుకున్నారా..? అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం ఆడుతున్న రకరకాల ఆటల్ని చూస్తూ… ప్రజలు ప్రేక్షక పాత్రకే పరిమితం కావడం తప్ప, ఇలాంటి పరిణామాలను ఏ రకంగానూ ప్రభావితం చేయడంగానీ, కోరుకోవడంగానీ ప్రజలు చెయ్యరు! ఎలాగైతేనేం, భాజపా విజయం సాధించింది, అంతే!