సెక్రటేరియట్ ని కూలదొసి, కొత్త అసెంబ్లీ భవనం కట్టడానికి కేసీఆర్ సర్కారు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే, దీనిపై విపక్షాలన్నీ రేపు (25న) ఛలో సెక్రటేరియట్ నిరసన కార్యక్రమానికి సిద్ధమౌతున్నాయి. ఈ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి ఫిర్యాదు చేసింది ప్రజాస్వామిక తెలంగాణ వేదిక. ఈ వేదిక తరఫున మాజీ ఎంపీ జీ వినోద్ ఢిల్లీ వెళ్లి అమిత్ షా, రాం మాధవ్ లతో భేటీ అయ్యారు. అయితే, ఆయన నిన్ననే భాజపాలో చేరతానే వార్తలొచ్చాయి. ఆయన అనుచరులు కూడా ఏర్పాట్లు చేసుకున్నారని కథనాలు వచ్చాయి. కానీ, ఆయన చేరిక వాయిదా పడింది. వచ్చే నెలలో ఉంటుందట! కారణం ఏంటంటే… ప్రస్తుతం ఆషాఢమాసం కాబట్టి మంచి ముహూర్తాలు లేవనీ, శ్రావణంలో అయితే మంచిదని చెప్పడంతో వినోద్ చేరిక తాత్కాలికంగా వాయిదా పడ్డట్టు చెబుతున్నారు.
హెరిటేజ్ భవనాల కూల్చివేతపై కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ హోంశాఖను వినోద్ కోరారు. ఈ మేరకు ఒక లేఖ ఇస్తూ… ప్రజాధనాన్ని తెలంగాణ సర్కారు వృథా చేస్తోందనీ, 1998లో ప్రభుత్వం గుర్తించిన హెరిటేజ్ భవనాల జాబితాలో ఎర్రమంజిల్ బిల్డింగ్ ఉందనీ, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దాన్ని ఆ జాబితా నుంచి ఉద్దేశపూర్వకంగానే తొలగించిందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 294 మంది సభ్యులున్నప్పుడే అసెంబ్లీ భవనం సరిపోయిందనీ, విభజన తరువాత తెలంగాణ అవసరాలకు అది సరిపోతుందని కేంద్రాని తెలిపారు. సెక్రటేరియల్ భవనం కూడా ఇప్పుడున్న అవసరాలకు సరిపోతుందనీ, ఏపీ ప్రభుత్వ శాఖలు కూడా ఖాళీ చేయడంతో వినియోగానికి మరింత అదనపు స్థలం అందుబాటులోకి వచ్చిందని చెప్పారు.
ఇప్పుడు కేంద్రానికి ఈ కూల్చివేతల వ్యవహారం చేరింది. దీన్లో భాజపా సర్కారు జోక్యం చేసుకునే వీలుందా అంటే.. ఉందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ – 8 ప్రకారం రాజధాని హైదరాబాద్ లోని ప్రభుత్వ ఆస్తులన్నింటికీ గవర్నర్ కస్టోడియన్ గా వ్యవహరించాలి. పునర్విభజన చట్టాన్ని అమలు చేస్తున్నది కేంద్ర హోంశాఖ కాబట్టి… కేసీఆర్ సర్కారు తలపెట్టిన ఈ నిర్మాణాలు, కూల్చివేతలపై భాజపా స్పందించే వీలుంటుందని చెబుతున్నారు. తెలంగాణలో ఎలాగూ భాజపా కార్యకలాపాలు కాస్త జోరుగానే ఉన్నాయి. మరి, ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుని ఏదైనా చర్యల పేరుతో ముందుకొస్తుందేమో చూడాలి.