ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు అయిన రాయపాటి కుటుంబం… త్వరలో.. ఏపీలో ఉన్న అన్ని ప్రధాన పార్టీలకూ.. ప్రాతినిధ్యం వహించడం ఖాయంగా కనిపిస్తోంది. రాయపాటి సాంబశివరావు తన ఆర్థిక అవసరాలు… ఇతర కారణాలతో బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించి.. తన ఇంటికి వచ్చి మరీ ఆహ్వానించిన రామ్మాధవ్ కోరికను మన్నించారు. అయితే.. తనకు దక్కబోయే లేదా బీజేపీ పెద్దలు చేయబోయే ఆర్థిక ప్రయోజనాల గురించి క్లారిటీ తీసుకునేందుకు ఢిల్లీ వెళ్లారు. ఆయన డిమాండ్లపై సానుకూల స్పందన వస్తే.. రాయపాటి వెంటనే కండువా కప్పించుకుంటారు. అయితే.. ఇక్కడ ట్విస్టేమిటంటే… రాయపాటితో పాటు… ఆయన కుటుంబసభ్యులెవరూ చేరే అవకాశం కనిపించడం లేదు.
రాయపాటి సాంబశిరావు కుమారుడు.. రాయపాటి రంగారావు.. టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. గత ఎన్నికల్లో టిక్కెట్ ఆశించారు కానీ… రాయపాటికి నర్సరావుపేట పార్లమెంట్ టిక్కెట్ ఇవ్వడంతో… ఆ కుటుంబానికి రెండో టిక్కెట్ ఖరారు చేయలేదు. అయినా సరే.. ఆయన తాను టీడీపీలోనే ఉంటానని.. తండ్రితో పాటు బీజేపీలోకి వెళ్లే ప్రశ్నే లేదని తేల్చి చెప్పేశారు. రాయపాటి కూడా.. చంద్రబాబుతో సమావేశమై.. తన ఆర్థిక ఇబ్బందుల గురించి వివరించి… తన కుటుంబం మొత్తం టీడీపీలోనే ఉంటుందని.. తాను మాత్రం బీజేపీలోకి వెళ్తానని చెప్పినట్లుగా తెలుస్తోంది. దానికి తగ్గట్లుగా.. రాయపాటి రంగారావు టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.
మరో వైపు రాయపాటి సాంబశివరావు సోదరుడు.. రాయపాటి శ్రీనివాస్ కుటుంబం వైసీపీ వైపు చూస్తోందన్న ప్రచారం జరుగుతోంది. శ్రీనివాస్ కుమారుడు.. మోహన్ సాయి కృష్ణ గతంలో.. కొంత కాలం.. గుంటూరు మేయర్ గా చేశారు. ఇప్పుడు… వైసీపీలోకి వెళ్లి మేయర్ సీటు సాధించాలని ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇటీవలి కాలంలో.. రాయపాటి మోహన్ సాయి కృష్ణ .. వైసీపీకి అనుకూలంగా ప్రకటనలు చేస్తున్నారు. వైసీపీతో చర్చలు జరిగి… మేయర్ సీటుపై క్లారిటీ వస్తే.. వారు … వైసీపీలోకి జంప్ చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు. మొత్తానికి రాయపాటి ప్యామిలీ.. టీడీపీ, బీజేపీ, వైసీపీల్లోనూ కీలకంగా వ్యవహరించడం ఖాయంగా కనిపిస్తోంది.