తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు.. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవికి చంద్రబాబు ఎంపిక చేశారు. పీఏసీ చైర్మన్ పదవి సహజంగా ప్రతిపక్ష పార్టీకి వస్తుంది. కేబినెట్ ర్యాంక్ ఉన్న ఆ పదవి కోసం… పలువురు సీనియర్ నేతలు పోటీ పడ్డారు. అయితే.. చంద్రబాబు మాత్రం..పయ్యావుల కేశవ్‌కే ప్రాధాన్యం ఇచ్చారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా గెలిచిన సీనియర్లలో… కొంత మంది గత ప్రభుత్వంలో మంత్రులుగా పని చేశారు. పయ్యావుల మాత్రం.. పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు పరాజయం పాలయ్యారు.
తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినప్పటికీ.. అనంతపురం జిల్లా సామాజిక సమీకరణాల నేపధ్యంలో.. మంత్రి పదవి మాత్రం ఇవ్వలేకపోయారు. ఈ కారణంగా.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు.. మంత్రి పదవులు తీసుకున్న సీనియర్లను మినహాయించి… చూస్తే.. పయ్యావులకే పీఏసీ పదవి దక్కడం సముచితమని చంద్రబాబు భావించి.. ఆ పదవికి ఎంపిక చేసుకున్నట్లు టీడీఎల్పీ వర్గాలు చెబుతున్నాయి. అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, కరణం బలరాం, గోరంట్ల బచ్చయ్యచౌదరి లాంటి నేతల పేర్లు కూడా పరిశీలనకు వచ్చాయి.
అయితే… చంద్రబాబు పయ్యావుల వైపే మొగ్గుచూపారు. గత ఎన్నికల్లో రాయలసీమలో టీడీపీ తుడిచి పెట్టుకుపోయింది. కడప,కర్నూలులో ఒక్క సీటు రాకపోగా.. చిత్తూరులో మాత్రం చంద్రబాబు ఒక్కరే విజయం సాధించారు. అనంతపురంలో బాలకృష్ణతో పాటు.. పయ్యావుల మాత్రమే… గెలిచారు. దీంతో.. రాయలసీమలో పార్టీ పటిష్టత కోసం కూడా.. పయ్యావులకు పదవి ఇవ్వడం అవసరమని చంద్రబాబు భావించినట్లు తెలుస్తోంది.