పుష్కరాల తొక్కిసలాట ఘటనపై మళ్లీ విచారణ జరిపించాలని ఏపీలోని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. సందర్భం లేకపోయినా ప్రశ్నోత్తరాల సమయంలో.. వైసీపీ సభ్యుడు జోగి రమేష్..దీనిపై ప్రశ్న వేశారు. దీనికి దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. ఆ ఘటనపై మళ్లీ మంత్రివర్గ ఉపసంఘంతో విచారణ జరిపించాలని అనుకుంటున్నట్లుగా ప్రకటించారు. ఈ బాధ్యతను కూడా చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిని నిగ్గుతేల్చేందుకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘానికే అప్పగిస్తామని కూడా ఆయన చెప్పుకొచ్చారు. తొక్కిసలాటకు అక్కడ జరిగిన షూటింగే కారణమని… ప్రశ్న వేసిన జోగి రమేష్ ఆరోపించారు.
2015 జూలై 14న గోదావరి పుష్కరాల తొలి రోజు జరిగిన తొక్కిసలాటలో 27మంది ప్రాణాలు కోల్పోగా పెద్ద సంఖ్యలో గాయ పడ్డారు. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పుష్కర స్నానం చేసి వెళ్లిన వెంటనే ఈ దుర్ఘటన జరిగింది. చంద్రబాబు స్నానం చేయడం.. ఇతర అంశాలను.. అక్కడ.. బోయపాటి నేతృత్వంలో షూట్ చేశారని.. వైసీపీ నేతలు విమర్శించారు. చంద్రబాబే తొక్కిసలాటకు కారణమని… ఆరోపణలు చేశారు. దీనిపై.. అప్పటి ప్రభుత్వం కూడా.. జస్టిస్ సోమయాజులు ఏకసభ్య కమిటీని విచారణకు నియమించింది. విచారణ జరిపిన ఈ కమిటీ.. ముహుర్త కాలంపై జరిగిన అతి ప్రచారమే ప్రధాన కారణమని నిర్ధారించింది. ఆ నివేదికను గతంలోనే ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది.
పుష్కరాల మొదటి రోజు ఉదయం 6.26 గంటలకు పవిత్ర పుణ్య స్నానం ఆచరిస్తే మంచిదంటూ జరిగిన విస్తృత ప్రచారమే ఇందుకు కారణమని కమిషన్ నిర్థారించింది. ఆ ప్రచారం నమ్మిన లక్షలాది మంది భక్తులు వేకువ జామునే పుష్కర ఘాట్‌కు చేరుకున్నట్లు పేర్కొంది. వారంతా ముహుర్తాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక్కసారిగా బారికేడ్లు తోసుకుంటూ నదిలోకి దిగేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగిందని నివేదికలో పేర్కొంది. గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట, దుర్ఘటనకు దారితీసిన కారణాలు సహా పలు అంశాలను కమిషన్ ప్రత్యక్ష సాక్షులు, విధుల్లో ఉన్న అధికారులు, బాధితుల నుంచి బహిరంగ విచారణ ద్వారా వివరాలు సేకరించిందని ప్రభుత్వం చెప్పింది. ఆ దుర్ఘటనపై అసెంబ్లీ ఆమోదించిన కమిటీ ఉండగా… కొత్తగా మరో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించాలని ప్రభుత్వం అనుకోవడం కలకలం రేపుతోంది.