విజయ్ దేవరకొండ..న్యూ సూపర్ స్టార్ ఆఫ్ టాలీవుడ్. ఈ విషయాన్ని ఫిక్స్ చేసే సినిమాగా మారబోతోంది డియర్ కామ్రేడ్. ఈ సినిమా కు వచ్చే విజయాన్ని బట్టి, ఈ సినిమాలు విజయ్ పుల్ చేసే స్టామినాను బట్టి, తరువాత తరం సూపర్ స్టార్ గా విజయ్ మారబోతున్నాడా? లేదా? అన్నది కాస్త క్లియర్ అవుతుంది.
ఒకప్పుడు పవన్, ఆ తరువాత బన్నీ, ఎన్టీఆర్, మహేష్ లకు యూత్ లో వున్న క్రేజ్ ఇప్పుడు విజయ్ కు కూడా కనిపిస్తోంది. ఎన్టీఆర్, మహేష్, బన్నీ లాంటి వాళ్లకు పారంపర్యంగా వచ్చిన ఫ్యాన్ బేస్ వుంది. అలాగే ఆ ఫ్యాన్ బేస్ కు మరీ పిచ్చి క్రేజ్ లేదు. కానీ విజయ్ దేవరకొండకు ఇప్పుడు యూత్ లో పిచ్చి క్రేజ్ వుంది. పల్లె, పట్నం తేడా లేకుండా కుర్రకారు విజయ్ అంటే ఊగుతున్నారు. అది వాస్తవం.
సినిమా యావరేజ్ అయితే చాలు, విజయ్ దాన్ని విజయతీరాలకు తీసుకెళ్తాడు అనే మాట ఇప్పడు టాలీవుడ్ లో ఎక్కడ పడితే అక్కడ వినిపిస్తోంది. అదే సమయంలో ఫ్యాన్స్ మధ్య వైరంలో భాగంగా సోషల్ నెట్ వర్క్ లో విజయ్ ను ధ్వేషించేవారు కూడా వున్నారు. విమర్శలు కురిపించేవారు వున్నారు.
ఎవరు ఎలా వున్నా, విజయ్ ది ఒక పంథా. అది అతనికి మాత్రమే సాధ్యమైన స్టయిల్. ఆ స్టయిల్ ను అనుకరించాలని చూసినా సాధ్యం కాదు. విజయ్ ఆటిట్యూడ్ ను కాపీ కొట్టే ప్రయత్నం ఆ మధ్య ఒకరిద్దరు అప్ కమింగ్ యంగ్ హీరోలు చేసారు కానీ అది క్లిక్ కాలేదు. ఈ ఆటిట్యూడ్ అన్నది విజయ్ కు బై డీఫాల్ట్ వున్నట్లు కనిపిస్తోంది.
డియర్ కామ్రేడ్ ప్రమోషన్ల విషయంలో కూడా విజయ్ దేవరకొండ విచక్షణ శైలిని పాటించారు. ఇదంతా ఆయన సెల్ఫ్ ప్రొమోషన్, సెల్ఫె మార్కెటింగ్ అని విమర్శలు ఓ పక్కన వినిపిస్తూనే వున్నాయి. కానీ అదే సమయంలో సినిమాను జనాల దగ్గరకు తీసుకెళ్లడంతో ఇదంతా చాలా మంచి ప్రయత్నం, మంచి కష్టం అని కామెంట్లు వినిపిస్తున్నాయి. నెల రోజులు కేవలం ఈ మ్యూజిక్ ఫెస్టివల్స్ కోసమే విజయ్ కేటాయించడం విశేషం.
డియర్ కామ్రేడ్ కు డైరక్టర్ కొత్త. అదే సినిమా బ్యానర్ లో అంతకన్నా పెద్ద సినిమాలు వచ్చాయి. కానీ డియర్ కామ్రేడ్ కు ఇంత క్రేజ్ వస్తోంది అంటే అది కేవలం విజయ్ కు వున్నక్రేజ్ అని అంగీకరించాల్సిందే. విజయ్ పేరు చెబితే ఇప్పుడు యూత్ ఊగిపోతోంది. ఇది సినిమా విజయానికి ఏ మేరకు సహకరిస్తుంది అన్నది రెండు రోజుల్లో తేలిపోతుంది.
డియర్ కామ్రేడ్ సినిమా నలభై కోట్ల మార్కెట్ చేసింది. తరువాత నిర్మిస్తున్న హీరో సినిమా బడ్జెట్ నే యాభై కోట్లు. అంటే కనీసం 60 కోట్ల మార్కెట్ చేయాలి. ఇవన్నీ డిసైడ్ చేసేది డియర్ కామ్రేడ్ విజయం మాత్రమే. ఈ సినిమా కు వచ్చే అప్లాజ్, రేటింగ్, సక్సెస్ ను బట్టే విజయ్ దేవరకొండ సూపర్ స్టార్ ప్రయాణం ఆధారపడి వుంటుంది.
ఏమాత్రం తేడా జరిగినా విజయ్ ను కిందకు లాగడానికి చాలా శక్తులు సిద్దంగా వున్నాయి. టాలీవుడ్ లో అది సహజం. ఏం జరుగుతుందో ఈవారంలో తేలిపోతుంది.
https://www.youtube.com/watch?v=MdIyH2inXGo