ఏపీ కొత్త గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్ బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే, విభజన తరువాత గడచిన ఐదేళ్లలో రెండు తెలుగు రాష్ట్రాలకూ ఉమ్మడి గవర్నర్ గా నర్సింహన్ ఉన్నారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని అంశాల్లో ఆయన విమర్శలూ ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ముఖ్యంగా, రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న కొన్ని అంశాలపై ఆయన చొరవ తీసుకోలేకపోయారు అనే విమర్శలూ ఉన్నాయి.
ఇప్పుడు కొత్తగా ఏపీకి వచ్చిన బిశ్వభూషణ్ పొరుగు రాష్ట్రం ఒడిశాకి చెందినవారు. ఆంధ్రా సమస్యలపై కొంత అవగాహన ఉండే ఉంటుంది. విభజన తరువాత ఏపీ పరిస్థితులపై జాతీయ స్థాయిలో చర్చ జరిగిన సందర్భాలు గతంలో చాలా ఉన్నాయి. కాబట్టి, ఆయన సీనియర్ నాయకుడిగా ఈ పరిస్థితులపై ఇప్పటికే ఒక అంచనాకి వచ్చి ఉంటారు. అంతేకాదు, గత భాజపా హయాంలో కేంద్రం, ఏపీ మధ్య సంబంధాలు ఎలా ఉండేవో, దాని వల్ల ఏపీకి రావాల్సిన నిధులు, ఇతర ప్రయోజనాల విషయంలో పడ్డ కోత ఏపాటిదో ఆయనకి తెలియంది కాదు. ఇప్పటికీ, రెండు రాష్ట్రాల మధ్యా అపరిష్కృతంగా చాలా విభజన అంశాలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ విషయంలో గవర్నర్ చొరవ చూపించాల్సిన అవసరం ఉంది.
బిశ్వభూషణ్ ఆర్.ఎస్.ఎస్. నేపథ్యం నుంచి వచ్చారు కాబట్టి, కేంద్రంలోని భాజపాకి అనుకూలంగా మాత్రమే వ్యవహరిస్తారా, ఏపీ పట్ల ఇప్పటికీ కేంద్ర వైఖరిలో పెద్దగా మార్పు కనిపించడం లేదు కాబట్టి, విభజన హామీలూ రావాల్సిన నిధుల విషయంలో తనవంతుగా ప్రత్యేకమైన చొరవ చూపుతారా అనే అనుమానాలూ కొంతమందిలో వ్యక్తమౌతున్నాయన్నది వాస్తవమే. అయితే, ఆర్.ఎస్.ఎస్. భావజాలం ఉన్నవారిలో కొంత క్రమశిక్షణ కూడా సహజంగానే ఉంటుంది. సీనియర్ నేత కాబట్టి, ఆయన అదే తరహా నిబద్ధతతో వ్యవహరించే అవకాశం కూడా ఉంటుందని భావించాలి. అంతేకాదు, స్వతంత్ర భావాలు కూడా ఈ ఆర్.ఎస్.ఎస్. నేపథ్యం నుంచి వచ్చినవారిలో ఉంటాయి. భాజపాని కాదని వారి అభిప్రాయాలను వెల్లడించిన చాలామంది నేతలూ ఉన్నారు. కాబట్టి, బిశ్వభూషణ్ ఏపీ ప్రయోజనాల విషయంలో చొరవ తీసుకోవాలనే ఆశాభావమూ కూడా మరికొందరు వ్యక్తం చేస్తున్నారు.