ఆంధ్రాలో కూడా ప్రతిపక్ష పార్టీ తరహాలో ఘాటైన విమర్శలకు భాజపా నేతలు దిగుతున్నారు. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దాం, ఆ తరువాత వారి పాలనలో లోపాలను ప్రశ్నించొచ్చు అని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుని వ్యవహరిస్తుంటే… ఇప్పుడు, భాజపా నేతలు టీడీపీ కంటే జోరుగా వైకాపా మీద విమర్శలు చేస్తుండటం విశేషం! జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు కేవలం పేపర్ల మీదే కనిపిస్తున్నాయనీ, టీడీపీ కంటే ఎక్కువ స్థాయిలో అక్రమాలు పాల్పడుతున్నారంటూ ఈ మధ్యనే ఏపీ భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు చేశారు. ఇప్పుడు, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ కూడా అదే స్థాయి తీవ్ర విమర్శలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పడ్డ జగన్ సర్కారు తప్పటడుగులు వేస్తోందని విమర్శించారు రామ్ మాధవ్. గడచిన ఐదేళ్లుగా ఒక ప్రాంతీయ పార్టీ అధికారాన్ని ఈ రాష్ట్ర ప్రజలు చూశారనీ, ఆ పార్టీ వల్ల నష్టాన్ని అనుభవించి ఇప్పుడు మరో ప్రాంతీయ పార్టీకి అధికారం కట్టబెట్టారన్నారు. దీంతో ఏపీ ప్రజల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిందన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వల్ల ప్రజలకు మేలు కంటే, కీడు ఎక్కువగా జరుగుతుందనే భయం తమకు కలుగుతోందన్నారు. ఈ రాష్ట్రానికి మంచి జరగాలంటే భాజపా బలమైన పార్టీగా ఎదగాల్సి ఉందన్నారు. 2024 ఎన్నికలు వచ్చేనాటికి ఈ రాష్ట్రంలో బలమైన జాతీయ పార్టీని ప్రత్యామ్నాయంగా నిలబెట్టాలని ప్రజలను కోరుతున్నా అన్నారు.
సరే, రామ్ మాధవ్ చెప్పినట్టుగానే ఏపీ పరిస్థితి పొయ్యిలోనే పడింది అనుకుందాం! ఆ పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యతాయుతమైన స్థానంలో భాజపా ఉంది కదా? ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో వారే ఉన్నారు కదా. పార్టీ బలోపేతం చేయాలనుకుంటే ఇలాంటి విమర్శలతో కాలయాపన ఎందుకూ… ప్రత్యేక హోదా గురించి స్పష్టమైన ప్రకటన చేయండి, పోలవరం, రాజధాని నిర్మాణ నిధులు, ఇతర ఫ్యాక్టరీలు, రెవెన్యూ లోటు భర్తీ… ఇలాంటి అన్ని అంశాలపై చకచకా సానుకూల నిర్ణయాలు తీసుకోమనండి. అప్పుడు ఏపీ ప్రజల్లో నిజంగానే భాజపా మీద కొంత పాజిటివిటీ కలుగుతుంది. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉండి కూడా… ఎప్పుడో మరో ఐదేళ్ల తరువాత, ఏపీలో బలమైన శక్తిగా ఎదిగితే తప్ప రాష్ట్రానికి మేలు జరగదు అన్నట్టుగా రామ్ మాధవ్ మాట్లాడుతున్నారు. ప్రాంతీయ పార్టీలను బలహీన పరచడం, ఆ స్థానంలో భాజపాకి ప్రతిష్టించడం.. ఇదే భాజపా ప్రస్తుత లక్ష్యం. అందుకే, జాతీయ పార్టీ ఉంటే తప్ప అభివృద్ధి జరగదు అనే ఒక అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రాల పట్ల కేంద్రానికి ఉండాల్సిన బాధ్యతను విమర్శిస్తోందన్న వాస్తవాన్ని ప్రజలు గ్రహించలేరేమో అనుకుంటున్నట్టుగా ఉన్నారు! సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడిచే క్రమంలోనే భాజపా విధానాలున్నట్టుగా ఆయన మాటలు వినిపిస్తున్నాయి.