ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనూహ్యమైన చిక్కులు వచ్చి పడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల.. ఆయన విధానాలు.. అభివృద్ధి వ్యతిరేకంగా ఉండటం వల్ల.. ఏ అంతర్జాతీయ ఆర్థిక సంస్థ కూడా.. రుణం మంజూరు చేయడానికి ఇష్టపడటం లేదన్న విస్తృత ప్రచారం జరగడమే.. ఈ చిక్కులన్నింటికీ కారణం. అభివృద్ధి, ఉత్పాదక కార్యక్రమాలన్నింటినీ నిలిపి వేసి.. నగదు బదిలీ పథకాలు మాత్రమే అమలు చేస్తున్నారన్న ప్రచారం… బయట ఉద్ధృతంగా సాగుతోంది. దీన్ని ఖండించడానికి ప్రభుత్వం తంటాలు పడాల్సి వస్తోంది.
అమరావతికి మాత్రమే రుణం ఆగిందంటున్న ఏపీ సర్కార్..!
అమరావతికి ప్రపంచబ్యాంక్‌తో పాటు.. ఏఐబీబీ ఇవ్వాలనుకున్న రుణాలు ఆగిపోయాయి. ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు రెండు బ్యాంకులు ప్రకటించాయి. దీంతో ఒక్క సారిగా కలకలం రేగింది. ఇక ఏపీ సర్కార్ కు.. ఏ ఆర్థిక సంస్థ కూడా సాయం చేయడానికి సిద్ధంగా లేదన్న ప్రచారం జరిగింది. వెంటనే ఏపీ సర్కార్ నష్ట నివారణ చర్యల కోసం… ఓ క్లారిఫికేషన్‌ను మీడియాకు పంపింది. రుణాలు నిలిపివేయడంపై.. పనిగట్టుకుని దీనిపై దుష్ర్పచారాన్ని చేస్తున్నారని ప్రభుత్వం మండిపడింది. అమరావతి కోసం ప్రతిపాదిత రుణ ప్రాజెక్ట్ లో ప్రపంచ బ్యాంక్ తో పాటు ఏఐఐబీ కూడా ఒక భాగస్వామి అని, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రెండింటి విషయంలో వర్తిస్తుందని స్పష్టం చేసింది. అది అమరావతి ప్రాజెక్ట్‌కు మాత్రమే పరిమితమని.. ఇతర ప్రాజెక్టులకు ఆయా బ్యాంకులు రుణాలిస్తాయని చెబుతున్నారు.
మిగతా ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తామని చెబుతున్న ప్రభుత్వం..!
ఏఐఐబీ ఏపీలో పలు ప్రాజెక్టులకు రుణ సాయం చేస్తోంది. ఈ ప్రాజెక్టులన్నింటికీ.. సాయం నిలిపి వేస్తుందన్న ప్రచారం ఉద్ధృతంగా సాగుతోంది. దీన్ని ఏపీ ప్రభుత్వం ఖండిచింది. రాష్ట్రానికి అనేక ప్రాజెక్ట్ లను ఏఐఐబీ మంజూరు చేసిందని ఈ సందర్భంగా ప్రభుత్వం స్పష్టం చేసింది. 24 గంటలు విద్యుత్, విద్యుత్ సరఫరా వ్యవస్థను మెరుగుపర్చే ప్రాజెక్ట్ లో భాగంగా 140 మిలియన్ డాలర్లను ఇదివరకే మంజూరు చేసిందని, గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల కోసం 400 మిలియన్ డాలర్లు, పట్టణాల్లో పారిశుధ్యం కోసం 400 మిలియన్ డాలర్లు మంజూరు చేసిందని వివరించారు. ఈ పనులన్నింటినీ కొనసాగిస్తామని…ఈ ప్రాజెక్టులను ఆపబోమని ప్రభుత్వం ప్రకటించింది.
రుణ సంస్థలకు నమ్మకం కలిగించేందుకు ప్రయత్నాలు..!
అమరావతి కి రుణం ఇవ్వకపోయినా.. ఆ మొత్తం ఇతర ప్రాజెక్టులకు ఆయా బ్యాంకులు ఇస్తాయని.. ఏపీ సర్కార్ చెబుతోంది. అమరావతి నిర్మాణానికి ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడుల బ్యాంక్ ఇస్తామన్న ప్రతిపాదిత రుణాన్ని ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ లకు ఉపయోగిస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఈ బ్యాంక్ మంజూరు చేసిన ప్రాజెక్ట్ లపై మరింత వేగవంతంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని స్పష్టం చేసింది. ఏపీ లోటు బడ్జెట్లో ఉంది. జీతాలు, పెన్షన్లు ఇతర వాటికే ఆదాయం సరిపోతుంది. ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాలన్నా… రుణాల మీదనే ఆధారపడాలి. ఇప్పుడు. ఆ రుణాలు కూడా.. ఏపీకి ఇచ్చేందుకు అంతర్జాతీయ రుణ సంస్థలు ఆలోచిస్తున్నాయన్న ప్రచారం.. ప్రభుత్వాన్ని కూడా ఆందోళనకు గురి చేస్తోంది. వాటికి నమ్మకం కలిగించేందుకు ప్రయత్నిస్తోంది.