బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ వర్గాలలో కలకలం సృష్టిస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో బిజెపి ఎదగాలంటే టిడిపి చితికి పోవాలని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..
ఇటీవల కొద్దికాలంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో బలపడడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ లీడర్ లని చేర్చుకోవడం , ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ లీడర్ లని చేర్చుకోవడం ద్వారా బలపడాలని బిజెపి ప్రయత్నిస్తోంది. అయితే లీడర్స్ బిజెపి లో చేరుతున్నప్పటికీ అటు క్యాడర్ చేరడం కానీ ఇటు ప్రజలలో బిజెపి పట్ల సానుభూతి రావడం గానీ జరగడం లేదు. దీంతో ఏదో ఒక రకంగా తెలుగుదేశం పార్టీ చితికిపోయేలా చేస్తేనే బిజెపి బలపడడం సాధ్యమవుతుందన్న అభిప్రాయం ఆ పార్టీ నేతలలో వచ్చినట్లుగా కనిపిస్తోంది. మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. దాంతో పాటే, బిజెపి జాతీయ నేత రామ్ మాధవ్, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వైయస్ఆర్సిపి పార్టీని విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలను సమర్థించారు.
అయితే సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యల పట్ల మిశ్రమ స్పందన వస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బిజెపి అని, నిజంగా గా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలో బలపడాలంటే , ఆ పార్టీ తన కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ రెండు రాష్ట్రాలకు నిధులు సాయం చేయడం, ఈ రెండు రాష్ట్రాల పట్ల విభజన హామీలను పూర్తిగా నెరవేర్చడం – లాంటి పనులు చేస్తే ప్రజల్లో ఆ పార్టీ పట్ల సానుకూల వైఖరి వస్తుందని, అప్పుడు ఇతర పార్టీల నాయకులని చేర్చుకున్నా ఉపయోగం ఉంటుందని, ప్రజలకు ఉపయోగపడేవి ఏమీ చేయకుండా కేవలం నాయకులను చేర్చుకోవడం వల్ల ప్రయోజనం ఉండదని జనాలు అంటున్నారు. మరి తెలుగు రాష్ట్రాల్లో బలపడాలనే బిజెపి కోరిక ఏ మేరకు నెరవేరుతుందో చూడాలి.