తెలంగాణాలో మంత్రులు నో వర్క్ మోడ్‌లో ఉన్నారు. పని చేద్దామంటే.. ఎవరికి ఏ కోపం వస్తుందో అర్థం కాని పరిస్థితి.. అందుకే.. అందరూ చెప్పిన పని మాత్రమే చేసి సైలెంట్‌గా ఉంటున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని బిక్కు,బిక్కు మంటున్నారు. హారీశ్ రావు లాంటి వారినే పక్కన పెట్టడం, ఈటెల రాజేందర్ ను కేబినెట్లోకి తీసుకునే విషయంలో చివరి వరకూ టెన్షన్ పెట్టడంతో.. మంత్రులు.. ఎందుకైనా మంచిదన్న అతి జాగ్రత్తకు పోతున్నారు. తమ శాఖకే చెందిన విషయాలైనా వాటి జోలికే వెళ్లడం లేదు. సిఎం చెప్తే తప్ప పట్టించువకోవడం లేదు. ఓ రకంగా మంత్రులంతా అచేతన స్థితిలోనే ఉన్నారు.
విద్యా సంవత్సరం మొదలైందంటే చాలు ఆ శాఖ మంత్రి సమీక్షలతో బిజీబిజీగా ఉండే వారు. కానీ మంత్రి జగదీశ్ రెడ్డి అలాంటి సమీక్షలు చేసిన దాఖలా లేవు. ఇంటర్ పరీక్షల వ్యవహారంలో ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అయినా జగదీశ్ రెడ్డి స్వంతంగా స్పందించ లేదు. ఆయన జిల్లా రాజకీయాల్లో బిజీబిజీగా గడిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో జరిగిన సమావేశానికి మాత్రమే హాజరయ్యారు. ఇదొక్కటే కాదు,డిగ్రీ ఫలితాలు ఆలస్యమైనా లైట్ తీసుకున్నారు. వానా కాలం ప్రారంభానికి ముందు నుండి వ్యవసాయశాఖ హడావుడి ఎక్కువగా ఉంటుంది.విత్తనాలు,ఎరువులు సరఫరాపై మంత్రి ఎప్పటికప్పడు సమీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది..అదే వర్షాభావ పరిస్థితులు నెలకొంటే ప్రత్యామ్నాయ పంటలపై రైతులను మళ్లించేలా శాఖా పరమైన చర్యలు చేపట్టాల్సి ఉంటుంది..కానీ అలాంటి పరిస్థితే కన్పించలేదు.
కార్మికశాఖా మంత్రి మల్లా రెడ్డి ఏం పని చేస్తున్నారో ఎవ్వరికీ తెలియదు..మొదటి ప్రభుత్వంలో గొర్రెలు,చేపల పంపిణీతో హడావుడిగా కనిపించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇప్పుడు స్తబ్ధుగా ఉన్నారు. హోం మంత్రి మహమూద్ అలీ అయితే ప్రతీ రోజూ ఏదో ఒక సందర్భంలో సెక్రటేరియట్ కైతే వస్తారు కానీ ఏం చేస్తారో ఎవరికీ తెలియదు. దూకుడుగా వ్యవహరించాలని అనుకున్నా కొత్త మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు పదవి ఇచ్చే ముందే షరతులు వర్తిస్తాయని చెప్పారట. దీంతో ఆ దూకుడికి తాళం పడింది. తన శాఖల రీత్యా ఇంద్రకరణ్ రెడ్డి ఎప్పుడూ సైలెంట్ గానే ఉంటున్నారు.
అనుభవం ఉన్న ఈటెల రాజేందర్ సిఎం మూడ్ తెలిసి మసులుకుంటున్నారు. తన శాఖ ఏదో తాను అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. పెద్దగా ప్రచార ఆర్భాటం లేకుండా లో ప్రొఫైల్ తో వ్యవహరిస్తున్నారు. పంచాయతీ రాజ్ శాఖలో కొత్తగా చేసేదేమీ లేక జిల్లా రాజకీయాలకే పరిమితమవుతున్నారు. ఇక సిఎంకు సన్నిహితంగా ఉండే మంత్రి ప్రశాంత్ రెడ్డి తన శాఖ వ్వవహారాల కంటే ఎక్కువగా సిఎం ఆదేశించిన పనులకే పరిమిత మవుతున్నారు. ప్రభుత్వ వర్గాల్లో ఆయనకు సిఎంఓ మంత్రి అనే పేరుంది. మొత్తంగా… మంత్రులు పేరుకే ఉన్నా.. అసలు అధికారం మాత్రం వేరే చోట ఉంది.