కిలో రూపాయి బియ్యం పథకానికి.. ఏపీ సర్కార్ హంగులద్దుతోంది. సన్నబియ్యంగా మార్చి.. వాటిని.. ప్యాక్ చేసి.. గ్రామ వాలంటీర్లతో.. డోర్ డెలివరీ చేయించాలని నిర్ణయించింది. ఇప్పటికే వాలంటీర్ల నియామాకాలు దాదాపుగా పూర్తయ్యాయి. అదే సమయంలో.. బియ్యంను ప్యాక్ చేసేందుకు సంచుల కాంట్రాక్ట్‌ను.. కూడా ఖరారు చేసేందుకు సిద్ధమయ్యారు. పైలట్ ప్రాజెక్ట్‌గా ముందుగా శ్రీకాకుళం జిల్లాలోని అధికారులు… సంచుల కోసం టెండర్లు పిలవగా… సుప్రసిద్ధ ప్లాస్టిక్ కంపెనీ.. నీల్ కమల్… ముందుకు వచ్చింది. ఐదు కేజీల బియ్యాన్ని ప్యాక్ చేసే సంచికి రూ.9, 10 కిలోల సంచికి రూ.12, 20కిలోల సంచికి రూ.14 ధరగా నిర్ణయించింది. దీనికి అధికారులు అంగీకరించారు. ఈ రేటును.. రాష్ట్రం మొత్తం.. అన్వయిస్తే.. ఏడాదికి రూ. 730 కోట్లు ఖర్చవుతుందట..!
పేదలకు ఇచ్చే బియ్యం ఖరీదు ఐదు కేజీలకు రూ. ఐదు మాత్రమే. అయితే.. దీనికి సంచికి రూ. 9 నుంచి 20 వరకూ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముందన్న విమర్శలు టీడీపీ వైపు నుంచి ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయి. ఇది దుబారా.. కాదా.. అని సోషల్ మీడియా.. టీడీపీ నేతలు.. మెల్లగా విమర్శలు ప్రారంభించారు. త్వరలో ఇది.. అసెంబ్లీలో చర్చకు వచ్చినా ఆశ్చర్యం లేదన్నట్లుగా పరిణామాలు సాగుతున్నాయి. నిజానికి ఈ రూ. 730 కోట్లు ఖర్చు పెట్టి.. పేదలకు అంతకు మించిన సాయం చేయవచ్చన్న అభిప్రాయం ఇతర వర్గాల నుంచి కూడా వస్తోంది. సంచుల కోసం… రూ. వందల కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఏమిటన్నది.. చాలా మందికి అర్థం కాని ప్రశ్న కూడా. ప్రతీ నెలా ఆ సంచులతో అవసరం కూడా ఉండదు.
నిజానికి సన్నబియ్యం ఇవ్వాలని ప్రభుత్వం అనుకుంది. కానీ సన్నబియ్యం ఇవ్వడానికి ఏడాదికి రూ. వెయ్యి కోట్లు అదనంగా కావాలని.. పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. అయితే.. అంత ఖర్చు కష్టమని… చెప్పి.. సన్న బియ్యం అమలును జనవరికి వాయిదా వేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే.. ఈ సంచులకు పెట్టే డబ్బులు పెడితే.. ఆ సన్న బియ్యం ఇచ్చేయవచ్చనేది అధికారుల ఆలోచన. కానీ ప్రభుత్వం మాత్రం.. సంచుల్లోనే డోర్ డెలివరీ చేయాలని అనుకుంటోంది. అసలు.. ఈ సంచుల కాంట్రాక్ట్ ను.. వైఎస్ భారతికి చెందిన సంస్థకు ఇస్తున్నారన్న ప్రచారం సోషల్ మీడియాలో ఉద్ధృతంగా సాగుతుంది. ఇది రాజకీయ విమర్శలుగా కూడా త్వరలో మారే అవకాశం ఉంది. నిజనిజాలేమిటన్నదానిపై ఆ తర్వాత చర్చ జరుగుతుంది.