పార్టీ ఓటమి పాలైనప్పుడే సుప్తావస్థలో ఉన్న అసంతృప్తులు ఒక్కోటిగా బయటకి వస్తాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అలాంటి పరిస్థితే అక్కడక్కడా కనిపిస్తోంది. టీడీపీలో ప్రముఖ నేతగా పేరున్న మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి సొంత నియోజకవర్గంలో ఇప్పుడు ఇలాంటి చర్చ మొదలైందని తెలుస్తోంది. మున్సిపల్ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా, రెవెన్యూ మంత్రిగా…. ఇలా ఎన్నో కీలక పదవులు చేపట్టారాయన. అయితే, ప్రస్తుతం యనమల సొంత స్థానం తునిలో గడచిన కొన్నేళ్లుగా ఆయన సోదరుడు యనమల కృష్ణుడు పార్టీ బాధ్యతలు చూస్తున్నారు. గడచిన రెండు పర్యాయాల ఎన్నికల్లో టీడీపీ తరఫున ఆయనే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ వచ్చారు. కానీ, రెండుసార్లూ ఆయన ఓడిపోయారు. దీంతో, ఇప్పుడు జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం రావాలంటే, యనమల కుటుంబంతో సంబంధంలేని వ్యక్తికి కీలక బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్ స్థానిక టీడీపీ వర్గాల్లో మొదలైందని సమాచారం.
నిజానికి, తుని నియోజకవర్గం నుంచి ఆయన వరుసగా ఆరుసార్లు విజయం సాధిస్తూ వచ్చారు యనమల రామకృష్ణుడు. 2004 వరకూ తుని స్థానం టీడీపీకి కంచుకోట. కానీ, వైయస్సార్ వ్యూహంతో యనమల ఓడిపోయారు. అక్కడి నుంచి ఆయన వరుసగా ఎమ్మెల్సీగానే ఉంటున్నారు. శాసన మండలి సభ్యునిగానే ఉంటూ మంత్రి పదవులు చేపట్టారు. 2004 తరువాత తమ్ముడిని తుని స్థానం నుంచి రంగంలోకి దింపుతూ వచ్చారు యనమల. కానీ, ఆయన గెలవడం లేదు. కారణం ఏంటంటే, యనమల కీలక పదవులు ఎన్ని చేపట్టినా సొంత ప్రాంతానికి చేసిన మేలేమీ లేదనే అభిప్రాయమూ కొంతమందిలో ఉంది. దీంతోపాటు, యనమల కృష్ణుడు తీరుపై స్థానికంగా పెద్దగా ప్రజాకర్షణ లేదనే అభిప్రాయం కూడా ఉంది!
ఆయన దూకుడుగా వ్యవహరిస్తుంటాడనీ, పార్టీకి అదే ఇబ్బందిగా మారిందనీ, గడచిన రెండు పర్యాయాలూ తునిలో టీడీపీ ఓటమికి కారణం అదేననీ, ఇప్పటికైనా పార్టీ నాయకత్వం ఈ కుటుంబ ఆధిపత్యం నుంచి మార్చాలనే డిమాండ్ జిల్లాకు చెందిన కొందరు నేతలు వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. గడచిన మూడు ఎన్నికలుగా, అంటే 2009 నుంచి వరుసగా మూడుసార్లు తునిలో టీడీపీకి ఓటమి ఎదురౌతూ వచ్చింది. ఇప్పుడు మార్పు తప్పదనే అభిప్రాయమూ వ్యక్తమౌతోంది. మరి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకీ, యనమలకీ ఉన్న సాన్నిహిత్యం రిత్యా తునిలో ఆ కుటుంబాన్ని కాదని వేరేవాళ్లని తెరమీదికి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందా అనేది అనుమానమే..! కానీ, మార్పు జరగకపోతే పార్టీకి ఇబ్బందే అనేది స్థానికుల అభిప్రాయంగా తెలుస్తోంది.