జనసేన పార్టీని బలోపేతం చేయడానికి… పవన్ కల్యాణ్ రంగంలోకి దిగారు. కీలకమైన కమిటీలని ప్రకటించారు. పార్టీలో క్రియాశీలకంగా ఉన్న ప్రతి ఒక్కరికి ప్రాధాన్యం దక్కింది. అయితే.. ఒక్క పేరు మాత్రం ఏ కమిటీలోనూ కనిపించలేదు. అదే జేడీగా ప్రసిద్ధుడైన.. సీబీఐ మాజీ జేడీ వి.వి.లక్ష్మినారాయణ పేరు. గత ఎన్నికలకు ముందు జనసేనలో చేరిన వీవీ లక్ష్మినారాయణ.. పవన్ కల్యాణ్ సిద్దాంతాల పట్ల చాలా ఆసక్తి చూపించారు. పవన్ కల్యాణ్‌ను పొగడ్తలతో ముంచెత్తేవారు. విశాఖ నుంచి పార్లమెంట్ కు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినా.. ఆయినా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా.. విశాఖలో జనసేన పార్టీ కార్యక్రమాలను చురుగ్గానే నిర్వహించారు. కానీ హఠాత్తుగా సైలెంటయిపోయారు.
ఇప్పుడు జనసేన కమిటీల్లోనూ లక్ష్మినారాయణ పేరు కనిపించలేదు. ఇటీవలి కాలంలో ఆయన పవన్ కల్యాణ్‌ను కలిసినట్లుగా కూడా లేదు. దాంతో… ఆయన జనసేనకు దూరమయ్యాడా.. అన్న చర్చ నడుస్తోంది. పవన్ కల్యాణ్.. జనసేన కార్యక్రమాలను యాక్టివ్‌గా చేయడం లేదనే అసంతృప్తి … లక్ష్మినారాయణలో ఉందని గతంలో ప్రచారం జరిగింది. ఎన్నికలు ముగిసిన తర్వాత ఇంత వరకూ… జనసేన పార్టీ.. ఒక్కటంటే.. ఒక్క రాజకీయ కార్యక్రమమూ చేపట్టలేదు. పార్టీ అంతర్గత వ్యవహారాలపైనా… రెండు, మూడు రోజుల పాటు సమీక్షలు నిర్వహించారు తప్ప… పట్టించుకోలేదు. ఈ క్రమంలో జేడీ లక్ష్మినారాయణకు జనసేనలో సీరియస్ నెస్ లేదన్న అభిప్రాయానికి వచ్చారన్న ప్రచారం జరుగుతోంది.
లక్ష్మినారాయణ ఐపీఎస్ అధికారి. పవన్ కల్యాణ్ సినిమా హీరో. ఇద్దరిది వేర్వేరు నేపధ్యం. లక్ష్మినారాయణ… తన సర్వీస్ అంతా తీరిక లేకుండా పని చేసి ఉంటారు. కానీ సినిమా హీరోల లైఫ్ స్టైల్ వేరుగా ఉంటుంది. అందుకే పవన్ కల్యాణ్… పార్టీ అధ్యక్షుడిగా ఆ తరహాలోనే వ్యవహరిస్తున్నారు. దీన్ని జేడీ అంగీకరించలేకపోతున్నారని అంటున్నారు. ఈ క్రమంలో.. కమిటీల్లోనూ జేడీ లక్ష్మినారాయణకు.. చోటు కల్పించకపోవడంతో.. ఆయన పార్టీకి దూరమైనట్లేనన్న చర్చ జరుగుతోంది. దీనిపై జేడీనే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.