ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రుల విన్యాసాలు అప్పుడప్పుడూ.. హైలెట్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా… ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి… ఎకాఎకిన మంత్రి అయిపోయిన… ముత్తంశెట్టి శ్రీనివాస్ అలియాస్.. అవంతి శ్రీనివాస్ వ్యవహారశైలి… అతి కన్నా.. కాస్త హడావుడిగా ఉందని.. సెక్రటేరియట్లో ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఆయన మాట తీరుతో.. ఉన్నతాధికారులు సైతం.. అసంతృప్తికి గురవుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే మంత్రి పదవి చేపట్టి రెండు నెలలు అవుతున్నప్పటికీ.. ఆయన మాత్రం.. ఇప్పటికీ… కిందకు దిగినట్లుగా లేరన్న అభిప్రాయం… విశాఖలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆయన చేసిన హంగామా చూసిన తర్వాత రోగులకూ అర్థమైపోయింది.
మంత్రి ముత్తంశెట్టి.. మరో వైపీ నేత ద్రోణంరాజు శ్రీనివాస్‌తో కలిసి.. విశాఖలోని ఘోషా ఆస్పత్రికి ఆకస్మిక తనిఖీ కోసం వెళ్లారు. అసలు అక్కడకే ఎందుకు వెళ్లారంటే.. ఆ ఆస్పత్రి సూపరిండెంట్.. ప్రభుత్వం మారినప్పటికీ… ముఖ్యమంత్రి ఫోటో… వైద్య ఆరోగ్య మంత్రి ఫోటో … ఆస్పత్రిలో పెట్టలేదని… ఆయనకు సమాచారం అందడంతో.. ఆ సంగతేమిటో తేల్చాలని ఆయన వెళ్లారు. దానికి.. ఆయన ఆకస్మిక తనిఖీ అని పేరు పెట్టుకున్నారు. వెళ్లగానే… ఆస్పత్రి మొత్తం కలియదిరిగి.. చూశారు. ఎక్కడైనా తప్పు కనబడితే.. సూపరిండెంట్‌ను కడిగేద్దామనుకున్నారు. మరీ ఇతర ప్రభుత్వాసుపత్రులతో పోలిస్తే.. మంచి ప్రమాణాలతో.. సౌకర్యాలు ఉండటంతో ఏమీ అనలేకపోయారు. దాంతో…. గర్భిణిల వార్డుకు వెళ్లారు. అప్పుడే లంచ్ సమయం అవుతూండటంతో… అంత కన్నా మంచి అవకాశం ఉండదనుకున్నారు. వెంటనే… తాను ఆ భోజనాన్ని రుచి చూస్తానని ఓ ప్లేట్ తెప్పించుకున్నారు.
రెండు ముద్దలు తిని… సూపరిండెంట్ పై చిందులేశారు. గర్భిణిలకు పెట్టాల్సిన అన్నం ఇదేనా… అని మండిపడ్డారు. పౌష్టికాహారం పెట్టాలి కదా అని ప్రశ్నించారు. ఆ తర్వాత తన ఆగ్రహానికి అసలు కారణాన్ని కూడా అదే ఫ్లోలో వెల్లడించారు ” ఇది చంద్రబాబు ప్రభుత్వం కాదు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం. రెండు నెలలు కావస్తున్నా ఇంకా చంద్రబాబు ..మాజీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు ఫొటోలు పెట్టుకున్నావంటే..నీవు ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నావో అర్థమవుతోంది. ఆ ఫొటో చూడగానే ఒళ్లు మండిపోతుంది…” అంటూ.. అసలు ఉద్దేశాన్ని వెల్లడించారు. సూపరిండెంట్‌కు అప్పటికి బల్బు వెలిగి ఉంటుంది. వెంటనే ఫోటోలు మార్చమని సిబ్బందిని ఆదేశించారు. ముత్తంశెట్టి హడావుడి చూసి.. రోగులు కూడా.. ముక్కున నోరేసుకోవాల్సి వచ్చింది.