ముద్రగడ పద్మనాభం నేటి నుండి ఆమరణ నిరాహార దీక్షకి కూర్చోబోతున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ ప్రతినిధులతో నిన్న అర్ధరాటి వరకు జరిపిన చర్చలు విఫలం కావడంతో తన భార్యతో కలిసి ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు కిర్లంపూడిలో ఆమరణ నిరాహార దీక్షకి కూర్చోబోతున్నట్లు ప్రకటించారు.
బొండా ఉమామహేశ్వరరావు, బొడ్డు భాస్కర రామారావు, తోట త్రిమూర్తులు ప్రభుత్వం తరపున ముద్రగడతో నిన్న అర్ధరాత్రి వరకు చర్చలు జరిపారు. మంజునాద్ కమీషన్ 90 రోజుల్లో తన నివేదికను ఇస్తుందని అంతవరకు ఓపిక పట్టమని వారు కోరగా 40 రోజులలోనే నివేదిక ఇవ్వాలని ఆయన కోరారు. అలాగే తెదేపా ఇచ్చిన హామీ ప్రకారం కాపుల సంక్షేమ కార్పోరేషన్ కి తక్షణమే రూ.1,900 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేసారు. ఉద్యమకారులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసారు.
దానిపై ముఖ్యమంత్రితో మాట్లాడిన తరువాత సమాధానం చెపుతామని అంతవరకు తన దీక్షను వాయిదా వేసుకోవలసిందిగా వారు కోరినప్పటికీ ఆయన అందుకు అంగీకరించలేదు. వారు వెళ్ళిపోయిన తరువాత తను ముందు ప్రకటించిన విధంగానే ఈరోజు ఉదయం 9 గంటల నుండి దీక్షకు కూర్చోబోతున్నట్లు ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. తనకు మద్దతుగా ఎవరూ రావద్దని కాపులు అందరూ తమ తమ ప్రాంతాలలోనే ఒక్కపూట నిరాహార దీక్షలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఆయన తన ఉద్యమంపై వెనక్కు తగ్గారని, ప్రభుత్వంతో రాజీకి సిద్దమవుతున్నారని మీడియాలో వార్తలు వస్తుండటంతో ఆయన ప్రతిష్టకు భంగం కలిగినట్లవుతోంది. బహుశః అందుకే ఆయన దీక్షకి కూర్చోవాలని నిశ్చయించుకొన్నారేమో? కానీ ప్రభుత్వం దిగివచ్చి ఆయనతో చర్చలు కొనసాగిస్తున్నపుడు ఆయన దీక్షకి కూర్చోవడం వలన ఆయన అనుకొన్న లక్ష్యం నెరవేరకపోగా చివరికి ఆయనే అభాసుపాలయ్యే ప్రమాదం ఉంటుంది. ఆయన దీక్ష మొదలుపెట్టిన కొన్ని గంటల తరువాత లేదా ఒకటి రెండు రోజుల తరువాత ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు అంగీకరించి దీక్షను విరమించడం కంటే రెండు మూడు రోజులు ఆగి ప్రభుత్వంతో చర్చలు జరిపి విఫలమయితే అప్పుడే దీక్షకి కూర్చొని ఉంటే సబబుగా ఉండేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.