ముఖ్యమంత్రి కేసీఆర్ గానీ, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గానీ, ఇవాళ్ల మీడియాతో మాట్లాడిన కొప్పులు ఈశ్వర్ గానీ… ఇలా తెరాస నేతలు ఈ మధ్య మున్సిపల్ ఎన్నికల్ని లక్ష్యంగా చేసుకునే విమర్శలు చేస్తున్నారు. అయితే, వారు చేస్తున్న వ్యాఖ్యానాల్లో ఎక్కువగా భారతీయ జనతా పార్టీని లక్ష్యంగా చేసుకుంటున్నారు. భాజపా వెర్సెస్ తెరాస నేతల మధ్య మాత్రమే మాటల యుద్ధం నడుస్తోంది. అయితే, ఈ క్రమంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ఎందుకు సైలెంట్ గా ఉంటోంది? ఈ వ్యవహారం వల్ల వారికి జరిగే నష్టం, ఒరిగే లాభం ఏదీ లేదని భావిస్తోందా? ఒకవేళ అలా భావించి, ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలపై ప్రేక్షక పాత్ర వహించడం సరిపోతుందా..? నిజానికి, ఈ క్రమంలో తమకేం సంబంధం లేదని సైలెంట్ గా ఉంటే… కాంగ్రెస్ కి జరగాల్సిన మరింత నష్టం జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి.
ఇవాళ్ల, కొప్పుల ఈశ్వర్ చేసిన కామెంట్స్ ఒక్కసారి చూస్తే… నెలలో పసుపు బోర్డు తెస్తామని చెప్పిన భాజపా ఎంపీ అరవింద్ ఇప్పుడా ఊసెత్తడం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ తో పూర్తయిందనీ, దీనికి జాతీయ హోదా భాజపా ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. పుల్వామా దాడుల పుణ్యమాని భాజపా అధికారంలోకి వచ్చిందన్నారు. భాజపా, కాంగ్రెస్ నేతలు పిచ్చి వెధవల్లా మాట్లాడుతున్నారన్నారు. ఈయన వ్యాఖ్యలో భాజపా మీద విమర్శలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఓ నాలుగు రోజుల కిందట, కేటీఆర్ కూడా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంగా చేసుకుని భాజపా మీదే విమర్శలు చేశారు. ఆ పార్టీకి ఒక్కటంటే ఒక్క స్థానం కూడా దక్కకుండా జాగ్రత్తపడాలంటూ భాజపా సెంట్రిక్ గానే పార్టీ నేతలూ కార్యకర్తలతో మాట్లాడారు. ఈ మధ్య సీఎం కేసీఆర్ కూడా… భాజపా తీరు మీద విమర్శలకే ప్రాధాన్యత ఇస్తున్న పరిస్థితి.
కాంగ్రెస్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే… తమకు కాంగ్రెస్ పోటీ కాదు అనీ, తెలంగాణలో ఆ పార్టీ ఉనికి లేదు అనే వ్యూహాత్మక దృక్పథంతో తెరాస వ్యవహరిస్తోందని! పార్లమెంటు ఎన్నికలకు ముందే ఈ వ్యూహంతో కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. అప్పట్లో రాహుల్ గాంధీ సంగారెడ్డి సభలో కేసీఆర్ ని తీవ్రంగా విమర్శిస్తే స్పందించలేదు. కానీ, ఆ తరువాత అమిత్ షా వచ్చి ఏదో ఒక్క మాట విమర్శిస్తే… గంటసేపు ప్రెస్ మీట్ భాజపా మీద కేసీఆర్ విమర్శలు చేశారు. ఉద్దేశపూర్వకంగానే భాజపాని రెండో స్థానంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఇది భాజపా ఎదుగుదలకు పరోక్షం సాయం అవుతుంది కదా అనే అభిప్రాయమూ కలుగుతుంది. కానీ, క్షేత్రస్థాయిలో చూసుకుంటే తెలంగాణలో భాజపాకి బలమైన మూలాలంటూ ఇంకా లేవు. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ కి ఉన్నంత గ్రిప్ అస్సలు లేదు. కాబట్టి, ఇప్పటికిప్పుడు తెరాసకు భాజపా నుంచి ఎదురయ్యే బలమైన పోటీ అంతగా ఉండదనేది కేసీఆర్ విశ్లేషణగా కనిపిస్తోంది. కాంగ్రెస్ ని అధఃపాతాళానికి తొక్కేయ్యాలన్న వ్యూహం ఎప్పట్నుంచో అమల్లో ఉందనేది కాంగ్రెస్ కీ తెలుసు. ఆ దిశగా తెరాస ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ, దీన్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ గ్రహిస్తున్నట్టు లేదు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కాంగ్రెస్ నంబర్ టు గా లేదు అనే అభిప్రాయం కలిగించే విధంగా వ్యవహరిస్తోంది. దీన్ని కాంగ్రెస్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్టు లేదు.