సినిమాల నుంచి ఉద్యమకారునిగా మారి.. ఆ తర్వాత టీవీ9 అమ్మకం వివాదంలో కేసుల పాలైన.. శివాజీ త్వరలో రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. దీనికి కారణం ప్రజాసేవ చేయడానికో… మరోకటో కాదు.. అక్రమ కేసులు పెట్టి.. తనను ఇబ్బంది పెడుతున్న వారికి త్రీడీ సినిమా చూపించాడనికే.. తాను రాజకీయాల్లోకి వస్తానని శివాజీ ప్రకటించారు. అమెరికా వెళ్తున్న క్రమంలో దుబాయ్ విమానాశ్రయంలో.. ఇమ్మిగ్రేషన్ అధికారులు.. లుకౌట్ నోటీస్ ఉందని చెప్పి.. ఆయనను.. మళ్లీ హైదరాబాద్‌కు పంపేశారు. కోర్టు ఎలాంటి ఆంక్షలు పెట్టకున్నా.. పోలీసులు కావాలనే ఇబ్బంది పెడుతున్నారని.. దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపిస్తున్న శివాజీ.. తాడో పేడో తేల్చుకోవాలని డిసైడయ్యారు. ఎన్నికల ఫలితాల తర్వాత తొలి సారి.. ఓ టీవీ చానల్ చర్చా కార్యక్రమంలో పాల్గొని..అసలు వివాదం.. భవిష్యత్ ప్రణాళికలపై వివరణ ఇచ్చారు.
టీవీ9 షేర్ల వివాదాన్ని… శివాజీ చాలా చిన్న విషయంగా తేల్చేశారు. రవిప్రకాష్ అసలు తనకు వాలంటరీగా షేర్లు ఇచ్చారని.. కానీ తనకు.. ఉచితంగా తీసుకోవడం ఇష్టం లేకనే.. రూ. ఇరవై లక్షలు ఇచ్చానని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత యాజమాన్యం చేతులు మారే సమయంలో కూడా.. తనకు సరైన సమాచారం ఇవ్వలేదన్నారు. టీవీ9 కొనుగోలు చేసిన అలంద మీడియా మొత్తం ప్రక్రియను… న్యాయబద్దంగా చేయలేదని… రవిప్రకాష్‌తో.. మేఘా కృష్ణారెడ్డి స్నేహం నటించి మోసం చేశారని… విమర్శించారు. భారతీయ జనతా పార్టీలో ఉండి ఉంటే.. తన పరిస్థితి ఇలా ఎందుకు ఉండేదని శివాజీ ప్రశ్నించారు. తనకు కుల పిచ్చి ఉండి ఉంటే.. చంద్రబాబు కంటే పెద్ద రాజకీయ నేతని అయ్యేవాడిని నటుడు శివాజీ చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లో తన కేసు వాదించడానికి ఒక్క లాయర్ రాలేదని .. కొందరు పోలీసులు ప్రజల కోసం పనిచేయకుండా.. తనపై కక్ష కట్టిన వాళ్ల కోసమే పనిచేస్తున్నారని మండిపడ్డారు. త్వరలో రాజకీయాల్లోకి వస్తానని.. ఏ పార్టీలో చేరేది ప్రకటిస్తానన్నారు.
అయితే.. శివాజీ టీడీపీ, వైసీపీల్లో చేరే అవకాశం లేదని.. ఆయన మాటలను బట్టి తెలిసిపోతోంది. జమిలి ఎన్నికలు వస్తే దేశంలో ప్రాంతీయ పార్టీలే ఉండవని జోస్యం చెప్పారు. జాతీయ పార్టీలోనే చేరుతానని, తనకు సినిమా చూపించిన వాళ్లకి త్రీడీ సినిమా చూపిస్తానని శివాజీ హెచ్చరించారు. సునామీలా ఎప్పుడైనా రాజకీయాల్లోకి వస్తానన్నారు. జగన్ పాలనపై మండిపడ్డారు. అందర్నీ రోడ్డున పడేస్తున్నారని విమర్శించారు.