ఎంత గొప్ప నాయకులైనా అప్పుడప్పుడు నాలిక మడత పడటం సహజమే. మన రాజకీయ నాయకులు అయితే కొన్నిసార్లు తెలిసి పొరపాటు మాట్లాడడం, కొన్నిసార్లు తెలియక వారి అవగాహనారాహిత్యాన్ని బయట పెట్టుకోవడం పరిపాటిగా మారింది. అయితే ఇలా వారు చేసే పొరపాట్లు ఒక్కొక్కసారి వారి రాజకీయ జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయి. గతంలో ఒక ఎమ్మెల్యే బీకాంలో ఫిజిక్స్ చదివా అని చెప్పి రావాల్సిన మంత్రి పదవికి దూరమైపోయాడు. గత రెండు నెలల వై ఎస్ ఆర్ సి పి ప్రభుత్వంలో అటు అసెంబ్లీలో ఇటు అసెంబ్లీ బయట వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల నోటి వెంట వచ్చిన పలు బ్లూపర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వైరల్ అయిన ఈ వీడియో ల ఆధారంగా, ఆయా నేతలను ఇంటర్నెట్లో నెటిజన్స్ ఒక ఆట ఆడుకున్నారు. ఒకసారి వైరల్ అయిన బ్లూపర్స్ ని పునరావలోకనం చేస్తే…
అవినీతి పరిపాలన చేయడమే మా ధ్యేయం అన్న డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి:
“ఒకటే లైన్ తో మా ప్రభుత్వం వెళుతుంది అని మా ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు. అవినీతి పరిపాలన చేయడమే ఆంధ్రప్రదేశ్ లో మా ధ్యేయం అని జగన్ మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు” ఇవీ ఆ మధ్య డిప్యూటీ సీఎం పుష్ప శ్రీ వాణి ఒక ప్రెస్మీట్లో చేసిన వ్యాఖ్యలు. విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేసిన ఆ ప్రెస్ మీట్ లో ఆమె పొరబడుతూ మాట్లాడిన ఆ మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ప్రత్యర్థి పార్టీల అభిమానులు మాత్రం ఆమె తన మనసులో మాట చెప్పింది అంటూ సెటైర్లు విసిరారు.
స్వామి వివేకానందుని, వివేకానంద రెడ్డి అని అసెంబ్లీలో వ్యాఖ్యాననించిన వైకాపా ఎమ్మెల్యే
“if the poor cannot come to education education must reach them at the plough, in the factory and everywhere” అని సాక్షాత్తు స్వామి వివేకానంద రెడ్డి గారు అన్నారు అని దెందులూరు నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అసెంబ్లీలో మాట్లాడగా దానికి సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది. వైఎస్ఆర్సిపి పార్టీ లో గెలిచిన నాయకులలో ఎక్కువమంది రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు ఉండడంతో, వారిని రెడ్డి రెడ్డి అని పిలిచి అలవాటైపోయి స్వామి వివేకానంద ని కూడా స్వామి వివేకానంద రెడ్డి అనిపించేలా చేసిందేమో అంటూ సునిశితంగా విమర్శలు చేశారు నెటిజన్లు.
అమెరికా కనుగొన్నది వాస్కోడిగామా అన్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి:
అసెంబ్లీ లో ప్రసంగిస్తున్న శ్రీకాళహస్తి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే మధుసూదన రెడ్డి “అమెరికా కనుగొన్నది వాస్కోడామా” అని వ్యాఖ్యానించాడు. ఆయన మేధస్సుకు అసెంబ్లీ ప్రసారాలు చూస్తున్న జనాలు ముగ్దులై పోయేలాగా, ఆయన పక్కనే ఉన్న మిగతా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, వాస్కోడామా కాదు వాస్కోడిగామా అంటూ ఆయనను సరిచేశారు. వాస్కో-డామా కాదు వాస్కోడిగామా అంటూ సరి చేశారే తప్పించి, ఈ మేధావి ఎమ్మెల్యేలలో ఒకరికి కూడా అసలు అమెరికా కనుగొన్నది కొలంబస్ అని తెలియక పోవడం హైలెట్ అని నెటిజన్లు సెటైర్లు విసిరారు.
మరి కొన్ని:
ఇవే కాకుండా, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అసెంబ్లీ కెమెరాల సాక్షిగా బడ్జెట్ ప్రసంగాన్ని జోల పాటలా భావించి నిద్రపోవడం లాంటివే కాకుండా, అసెంబ్లీలో కొంతమంది ఎమ్మెల్యేలు పెద్ద పెద్దగా అరుస్తూ బుల్లెట్ దిగిందా లేదా అని సినిమా డైలాగులు చెప్పడం కూడా జనాలకు కావాల్సినంత కామెడీ అందించింది. ఇక మరికొంతమంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని వాల్మీకి, అల్లా, జీసస్, షిరిడి సాయిబాబా లతో పోలుస్తూ భజన చేయడం జనాలనే కాదు ముఖ్యమంత్రి గారిని కూడా పొట్టచెక్కలయ్యేలా నవ్వించింది.
ఏదేమైనా ఈ రెండు నెలల కాలంలో కొంతమంది రాజకీయ నాయకులు జనాలకు మంచి కామెడీ రిలీఫ్ అందించారు అని చెప్పవచ్చు.