మాజీ ఎంపీ వివేక్ త్వరలోనే భాజపాలో చేరతానే ప్రచారం ఉంది. గతవారంలో ఆయన ఢిల్లీ వెళ్లి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలుసుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే ఆయన కాషాయ కండువా కప్పేసుకుంటారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే, ఆషాఢ మాసం కావడంతో మంచి ముహుర్తాలు లేవనీ, శ్రావణం రాగానే చేరిపోతారని అంటున్నారు. ఈ నేపథ్యంలో, మాజీ ఎంపీ వివేక్ తో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ కావడం ఇప్పుడు ఆసక్తికరమైన పరిణామంగా కనిపిస్తోంది.
ఆదివారం సాయంత్రం వివేక్ ఇంటికి స్వయంగా వెళ్లారు ఉత్తమ్. వివేక్ తో చాలాసేపు మంతనాలు జరిపారు. పార్టీ మార్పునకు సంబంధించి అంశమే ప్రధానంగా వారి మధ్య ప్రస్థావనకు వచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం తెరాసకు కూడా దూరంగా ఉంటూ, కొత్త సెక్రటేరియట్ నిర్మాణం, అసెంబ్లీ కూల్చివేత అంశంపై ఆయన పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే అంశమై వినతి పత్రం ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్లి అమిత్ షాని కలిసి వచ్చారు వినోద్. ఉత్తమ్ తో చర్చల్లో ఈ టాపిక్ వచ్చిందని సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా భాజపాలో చేరొద్దనే సలహా ఉత్తమ్ కుమార్ ఇచ్చారట.
తెరాస సర్కారుపై స్వతంత్ర వేదికపై ఉండి పోరాటం చేసే కంటే, జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లోకి వచ్చి పోరాటం చేస్తే మరింత ప్రభావవంతంగా ఉంటుందని వివేక్ కి ఉత్తమ్ సూచించినట్టు సమాచారం. పార్టీలోకి వివేక్ ని ఉత్తమ్ ఆహ్వానించినట్టు తెలుస్తోంది. అయితే, ఏ పార్టీలో చేరేదీ అనే అంశంపై ఇప్పటికిప్పుడే నిర్ణయం తీసుకునే ఉద్దేశంతో వివేక్ లేరనీ తెలుస్తోంది. ఆయన భాజపాలోకి వెళ్లడం ఖాయం అనే అభిప్రాయమే ఇంతవరకూ ఉంది. నిజానికి, గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దపల్లి ఎంపీగా వివేక్ గెలిచారు. ఆయన తండ్రి కూడా కాంగ్రెస్ నాయకులే. కాబట్టి, పార్టీతో దశాబ్దాలుగా ఉన్న సంబంధాలు దృష్ట్యా ఆలోచించి, కాంగ్రెస్ లోకి రావాలనే అభిప్రాయాన్ని ఉత్తమ్ వ్యక్తీకరించినట్టు చెబుతున్నారు. ఈ భేటీపై ఇరువురు నేతలూ స్పందించాల్సి ఉంది.