ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి.. తన పదవికి కొంత కాలం కిందట రాజీనామా చేశారు. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి చేసిన రాజీనామాకు సంఘిభావంగా ఆయన కూడా రాజీనామా చేశారు. అచ్చంగా రాహుల్ గాంధీలాగే.. తన రాజీనామాపై ఆయన చాలా సీరియస్‌గా ఉన్నారు. కచ్చితంగా ఆమోదించాల్సిందేనని పట్టుబడుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు చూస్తున్న ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్.. రఘువీరాకు సన్నిహితుడు. ఆయనకు కూడా.. తన రాజీనామా ఆమోదించి తీరాల్సిందేనని చెప్పి వచ్చారట. అలా చెప్పడమే కాదు.. ఇప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను ఆయన పట్టించుకోవడం మానేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపున ఒక్క కార్యక్రమం పెట్టేవాళ్లు కానీ.. ఒక్క ప్రెస్ మీట్ పెట్టే వారు కానీ లేరు. తులసీరెడ్డి మాత్రం.. కాంగ్రెస్ నేతగా ఉన్నా.. ఆయన.. వ్యక్తిగతంగా ఏదైనా తన వాదన వినిపిస్తున్నారు. కాంగ్రెస్ నేత కన్నా.. సీనియర్ నేతగానే.. ఆయన మాటలకు మీడియా విలువ ఇస్తోంది. అంతకు మించి.. కాంగ్రెస్ తరపున మాట్లాడేవారు లేరు. రఘువీరారెడ్డి… ఆయన స్వగ్రామంలోనే మకాం వేశారు. ఆరు నెలల వరకు.. రాజకీయాల గురించి మాట్లాడనని… రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనబోనని ప్రకటించారు. అంతే కాదు.. ఎవరైనా కాంగ్రెస్ నేతలు ఫోన్లు చేసినా మాట్లాడటం లేదట. కలుస్తామని చెప్పినా వద్దంటున్నారట. ప్రస్తుతం.. స్వగ్రామం నీలకంఠాపురంలో.. సొంతంగా ఓ ఆలయాన్ని నిర్మిస్తున్న.. రఘువీరా.. పూర్తి సమయం.. ఆ ఆలయ నిర్మాణానికే కేటాయిస్తున్నారని చెబుతున్నారు.
ఎన్నికలు ముగిసిన తర్వాత రఘువీరారెడ్డి… అనూహ్యంగా టీడీపీలో చేరబోతున్నారన్న ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించి ఉద్ధృతంగా ప్రచారం జరిగిన సమయంలోనే.. ఆయన పీసీసీ పదవికి రాజీనామా చేయడంలో ప్రచారం ఉద్ధృతం అయింది. దానిపై రఘువీరా స్పందించలేదు కానీ… రాజకీయాలకు మాత్రం ఆరు నెలలు దూరమని ప్రకటించారు. రఘువీరా ఆలోచన తెలిసిన ఏఐసిసి కూడా.. కొత్త పీసీసీ చీఫ్‌ను వెదుక్కునే పనిలో ఉందన్న ప్రచారం జరుగుతోంది. అంటే.. రఘువీరా.. యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉండాలంటే… తర్వాతైనా ఏదో ఓ పార్టీలో చేరక తప్పని పరిస్థితి…!